శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 12, 2021 , 12:54:27

లేండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగవద్దు : స్వామి వివేకానంద

లేండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగవద్దు : స్వామి వివేకానంద

సరిగ్గా ఇదే రోజున 1863 లో నరేంద్రనాథ్‌ దత్తా (స్వామి వివేకానంద) కోల్‌కతాలో జన్మించారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వశాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకులు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లండ్‌లలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేశారు. పాశ్చాత్యదేశాల్లో అడుగుపెట్టిన తొలి హిందూ సన్యాసిగా చరిత్రకెక్కారు. 1893 లో షికాగోలో జరిగిన పార్లమెంట్‌ ఆఫ్‌ వరల్డ్‌ రిలీజియన్స్‌ సమావేశంలో తూర్పు దేశాల తత్త్వాన్ని ప్రవేశెపెట్టిన ఘనతను సాధించారు.

భారతదేశం తిరిగివచ్చిన తర్వాత రామకృష్ణ మఠంను స్థాపించి భారత యువతకు దిశానిర్దేశం చేశారు. 39 ఏండ్ల వయసులో స్వామి వివేకానందుడు కన్నుమూశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ యువజన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం 1984 న ప్రకటించింది. ఎన్నో సాహిత్య రచనలు చేసిన స్వామి వివేకానంద.. తన చివరి రోజులను కోల్‌కతాలోని బేలూరు మఠంలో గడిపారు.

మహాత్ముడి చివరి ప్రసంగం

1948 లో ఇదే రోజున మహాత్మాగాంధీ తన చివరి ప్రసంగం చేశారు. అనంతరం అతను జనవరి 13 నుంచి నిరాహార దీక్షకు దిగారు. ‘మతపరమైన అల్లర్లలో నాశనాన్ని చూడటం కంటే మరణాన్ని స్వీకరించడం మంచిది’ అని తన చివరి ప్రసంగంలో గాంధీజీ అన్నారు. భారత్‌ నుంచి పాకిస్థాన్‌ విడిపోవడంతో దేశంలో మత ఘర్షణలు చెలరేగి ఎందరో చనిపోయారు. దీనిపై మహాత్ముడు విచారం వ్యక్తం చేస్తూ నిరాహార దీక్షకు కూర్చున్నారు.

ఇరాక్ యుద్ధాన్ని ఆమోదించిన యుఎస్ పార్లమెంట్

1991 లో ఇదే రోజున ఇరాక్‌పై సైనిక చర్య చేపట్టడానికి అమెరికా పార్లమెంట్‌ ఆమోదించింది. మూడు రోజుల చర్చ అనంతరం 250 ఓట్ల తేడాతో తీర్మానాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. వ్యతిరేకంగా 183 ఓట్లు వచ్చాయి.  అంతకుముందు, ఐక్యరాజ్యసమితి అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను తన సైన్యాన్ని కువైట్ నుంచి జనవరి 15 లోగా ఉపసంహరించుకోవాలని కోరింది. ఇరాక్ సైనిక చర్యలకు సిద్ధంగా లేమని హెచ్చరించింది. 

దాంతో 1991 జనవరి 16 న ఆపరేషన్ డిజర్ట్‌ స్ట్రామ్‌ పేరుతో మొదటి గల్ఫ్ యుద్ధం.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో భారీ బాంబు దాడులతో ప్రారంభమైంది. ఫిబ్రవరి 25 న ఇరాక్ సైన్యం కువైట్‌కు తిరిగి వెళ్ళింది. ఫిబ్రవరి 28 న యుద్ధంలో విజయం సాధించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని ముఖ్య సంఘటనలు :

2010: హైతీలో భూకంపం. 2.00,000 మందికి పైగా దుర్మరణం

2009: గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు ఏఆర్‌ రెహమాన్

2008: అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న కోల్‌కతా మార్కెట్‌లోని వందలాది దుకాణాలు

2007: బాఫ్టాకు నామినేట్ అయిన అమీర్ ఖాన్ చిత్రం 'రంగ్ దే బసంతి' 

2005: భారతీయ ప్రముఖ నటుడు అమ్రిష్ పూరి కన్నుమూత

1976: డిటెక్టివ్ నవలల రచయిత అగాథ క్రిస్టీ మరణం

1972: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ జననం

1954: తెలంగాణకు చెందిన రచయిత, కవి అలిశెట్టి జననం. ఇదే రోజునే ఆయన మరణం

1934: భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు సూర్సేనను 1934 జనవరి 12 న ఉరితీసిన బ్రిటిష్ సేనలు

1931: ప్రసిద్ధ పాకిస్తాన్ ఉర్దూ కవి అహ్మద్ ఫరాజ్ జననం

1908: పారిస్‌లోని ఈఫిల్ టవర్ నుంచి సుదూర వైర్‌లెస్ సందేశం పంపబడింది

1757: పశ్చిమ బెంగాల్‌కు చెందిన బండెల్‌ను పోర్చుగీస్ నుంచి స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ పాలకులు 

1708: ఛరాపతి షాహు మరాఠా పాలకుడిగా పట్టాభిషేకం

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo