శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 10:59:15

నేడు ‘బ్రిక్స్‌’ దేశాల భద్రతా సలహాదారుల సమావేశం

నేడు ‘బ్రిక్స్‌’ దేశాల భద్రతా సలహాదారుల సమావేశం

న్యూఢిల్లీ : బ్రిక్స్‌ దేశాలుగా పిలిచే బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల జాతీయ భద్రతా సలహాదారులు (ఎన్‌ఎస్‌ఏ) గురువారం వర్చువల్‌ విధానంలో సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు, పలు చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 4న ఐదు సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ప్రస్తుత బ్రిక్స్‌ చైర్‌ అయిన రష్యా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమాచారం నిర్వహించారు.

రష్యన్‌ ఫెడరేషన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి సెర్జీ లావ్రోవ్ అధ్యక్షత వహించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకార మంత్రి గ్రేస్ నలేడీ పాండర్ పాల్గొన్నారు. బ్రిక్స్ చైర్‌లో సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ సమావేశం ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది. యూఎన్‌జీఏ (యూనియన్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ) అజెండాలోని కీలక అంశాలపై సహా అంతర్జాతీయంగా బ్రిక్స్‌ సహకారంపై మంత్రులు చర్చించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఆరోగ్య రంగాల్లో తీవ్ర సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్‌ పోషించాల్సిన ముఖ్యపాత్రపై జైశంకర్‌ మాట్లాడారు.

ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ వంటి అంతర్జాతీయ సంస్థల సంస్కరణతో సహా బహుళపక్షాన్ని సంస్కరించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వర్చువల్‌ మీటింగ్‌లో భారత్‌ తీవ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే మంగళవారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ షాంఘై కో ఆపరేషన్‌ (ఎస్‌ఓసీ) వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. పాకిస్థాన్‌ భారత భూభాగాలను తమ భూమిగా చూపిస్తూ మ్యాప్‌ను ప్రదర్శించగా ఆయన సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. భారత్‌, చైనా మధ్య ఎల్‌ఏసీ వెంట నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనల మధ్య బ్రిక్‌ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo