శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 12:52:08

బుర్జ్‌ ఖలీఫా.. నయాగర.. టైం స్కేర్‌లో జాతీయ జెండా ప్రదర్శన

బుర్జ్‌ ఖలీఫా.. నయాగర.. టైం స్కేర్‌లో జాతీయ జెండా ప్రదర్శన


న్యూఢిల్లీ : భారత త్రివర్ణ పతాకానికి మరో గౌరవం దక్కింది. 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం బుర్జ్‌ ఖలీఫా, నయాగర జలపాతంలో జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు, న్యూయార్క్‌ టైం స్కేర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా పేరొందిన దుబాయి బుర్జ్ ఖలీఫాను శనివారం రాత్రి భారతీయ త్రివర్ణ పతాక రంగులతో ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబిస్తూ చేసిన ఈ లేజర్‌ షో ప్రవాస భారతీయులను ఆకట్టుకుంది. బుర్జ్ ఖ‌లీఫాతో పాటు అబుధాబిలోని అడ్నోక్ ట‌వ‌ర్‌పై మువ్వన్నెల వెలుగులు విర‌జిమ్మాయి. శ‌నివారం రాత్రి 8.45 గంట‌ల ప్రాంతంలో జ‌రిగిన ఈ లేజర్ షోకు సంబంధించిన లైవ్ వీడియోను దుబాయిలోని కాన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. భారత స్ఫూర్తిని ప్రతిధ్వనించినందుకు యూఏఈకి సీజీఐ ధన్యవాదాలు తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీకి దుబాయి రాజులు షేక్‌ ఖలీపా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ ముక్తూమ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే కెనడాలోని నయాగర జలపాతంలో తొలిసారిగా జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రపంచంలోనే ఎత్తయిన జలపాతంపై త్రివర్ణంతో ప్రకాశించింది. ఇండో-కెనడా ఆర్ట్స్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో టొరంటోలోని భారత కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అలాగే టొరంటో సిటీ హాల్‌లోనూ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఇండో కెనడియన్‌ కమ్యూనిటీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ వారసత్వానికి చెందిన పదిలక్షల మంది కెనడియన్లు ఉన్నారని, దేశానికి ముఖ్యమైన సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. అలాగే తొలిసారిగా న్యూయార్క్‌ టైం స్కేర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. చారిత్రక కూడలిలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. భారత కాన్సులేట్‌ జనరల్‌ రణధీర్‌ జైస్వాల్‌ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. వేడుకలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo