సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 01:54:14

హెచ్‌1బీ.. ఊరట

హెచ్‌1బీ.. ఊరట

వాషింగ్టన్‌, ఆగస్టు 13: హెచ్‌1బీ వీసాదారులపై విధించిన ప్రయాణ నిషేధాన్ని అమెరికా సడలించింది. జూన్‌ 22న అధ్యక్షుడు ట్రంప్‌ జారీచేసిన ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌లో పలు మార్పులు చేసినట్టు బుధవారం ప్రకటించింది. నిషేధం విధించిన తేదీ కంటే ముందు పనిచేస్తున్న సంస్థలోనే ఇప్పటికీ కొనసాగుతూ అమెరికా బయట ఉన్న వ్యక్తులను దేశంలోకి అనుమతిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగి కుటుంబసభ్యులకు కూడా ఈ సడలింపులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నిర్ణయంతో భారత్‌, చైనా ఐటీ నిపుణులకు ఊరట లభించనుంది. 

పలు షరతులు 

కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు అమెరికాలో నిపుణులు లభించకపోతే అక్కడి కంపెనీలు విదేశాల నుంచి నిపుణులను నియమించుకొనేందుకు హెచ్‌1బీ వీసా వీలుకల్పిస్తుంది. ఇది వలస వీసా కాదు. ఉద్యోగం ఇచ్చిన కంపెనీలో జాబ్‌ కాంట్రాక్ట్‌ ముగిసిన వెంటనే సదరు ఉద్యోగి అమెరికాను వదిలి వెళ్లాలి. ఉద్యోగంలో కొనసాగుతున్న కాలంలో ఏవైనా అవసరాలు ఉంటే అమెరికా వెలుపలికి ప్రయాణాలు చేయవచ్చు. అయితే, కరోనా నేపథ్యంలో అమెరికా పౌరులు కోట్లమంది ఉద్యోగాలు కోల్పోవటంతో వారికి ఉపాధి కల్పించేందుకు హెచ్‌1బీ వీసాపై పనిచేస్తూ తాత్కాలికంగా అమెరికా నుంచి బయటకు వచ్చిన విదేశీ నిపుణులు తిరిగి రాకుండా ట్రంప్‌ జాన్‌ 22న నిషేధం విధించారు. తాజాగా అమెరికా ప్రభుత్వం ఈ నిషేధాన్ని సడలిస్తూనే పలు షరతులు విధించింది. అవి.. 

  1.  హెచ్‌1బీ వీసాదారుడు మళ్లీ అమెరికాలోకి అడుగుపెట్టాలంటే అతడికి ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఆ ఉద్యోగితో తమకు చాలా అవసరం ఉందని అఫిడవిట్‌ ఇవ్వాలి. 
  2.  ఆ ఉద్యోగి అవసరాన్ని గుర్తిస్తూ అమెరికా లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్స్‌ (ఎల్‌సీఏస్‌) ఈ ఏడాది జూలైలోపే ధ్రువీకరించి ఉండాలి. 
  3.  సదరు ఉద్యోగితో అమెరికాకు అవసరం ఉందని ఆ ఉద్యోగి స్వదేశంలోని అమెరికా రాయబారి ధ్రువీకరించాలి.


logo