ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 21, 2020 , 21:48:07

‘బెన్ను’ను ముద్దాడిన నాసా వ్యోమనౌక

‘బెన్ను’ను ముద్దాడిన నాసా వ్యోమనౌక

వాషింగ్టన్‌: భూమికి సుమారు 33.4 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్టరాయిడ్‌ ‘బెన్ను’ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన వ్యోమ నౌక ‘ఓసిరిస్‌’ మంగళవారం ముద్దాడింది. ఆ ఉల్క ఉపరితలం నుంచి పిడికెడు మట్టి నమూనాలను సేకరించింది. లాక్హీడ్ మార్టిన్ సంస్థ నిర్మించిన ఓసిరిస్‌ స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన 11 అడుగుల పొడవైన రోబోటిక్‌ చేయి బెన్ను ఉత్తర ద్రువం సమీప ప్రాంతాన్ని తాకింది. అక్కడి రాళ్లు, మట్టి నమూనాలను ఇమిడిపట్టింది. అనంతరం వ్యోమ నౌక ఓసిరిస్‌ కొన్ని సెకండ్లలోనే బెన్ను కక్ష్యలోకి వెళ్లింది. అది సేకరించిన మట్టి నమూనాల చిత్రాలను బుధవారం పరిశీలిస్తామని మిషన్‌ నిర్వాహకులు తెలిపారు. అవసరమైన పక్షంలో మరోసారి బెన్నును తాకించి మరిన్ని నమూనాలు సేకరిస్తామని చెప్పారు. ఆస్టరాయిడ్‌ బెన్ను నుంచి నమూనాల సేకరణ విజయవంతమైన తర్వాత ఓసిరిస్‌ భూమికి తిరుగు ప్రయాణమై 2023లో చేరుతుందని వెల్లడించారు.


సుమారు 450 కోట్ల ఏండ్ల క్రితం ఏర్పడిన సౌర కుటుంబానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. భూమిపై పడే ఉల్కలపై పరిశోధనలు చేయడం ద్వారా సౌర కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు స్పష్టంగా తెలియడంలేదు. దీనికి కారణం ఆయా ఉల్కల శకలాలు భూ వాతావరణ ప్రభావానికి లోనవ్వడమే. దీంతో  ‘బెన్ను’ అనే ఆస్టరాయిడ్‌ నుంచి శకలాలను రోదసి నుంచే సేకరించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. భూమిపై జీవం ఆవిర్భావానికి కారణమైన సేంద్రియ సమ్మేళనాలు, నీటి జాడలు బెన్నుపై లభించవచ్చని అంచనా వేస్తున్నారు. బెన్ను నుంచి 60 గ్రాముల శకలాల్ని (పిడికిలి సైజు పదార్థాన్ని) తీసుకురావడానికి ‘ఓసిరిస్‌' అనే వ్యోమ నౌకను 2016లో పంపారు. రెండేండ్లుగా ఈ ఉల్క చుట్టూ పరిభ్రమిస్తున్న వ్యోమనౌక ఎట్టకేలకు మంగళవారం దానిని తాకింది. అక్కడి రాతి, మట్టి నమూనాలను సేకరించింది. ఈ వీడియోలను నాసా విడుదల చేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి