వాషింగ్టన్: అంగారక గ్రహంమీద ‘పర్సెవెరెన్స్’ రోవర్ సురక్షితంగా దిగడానికి ఉపయోగించిన ప్యారాచుట్ ద్వారా శాస్త్రవేత్తలు ఓ రహస్య సందేశాన్ని పంపించారు. నాసా సిస్టమ్ ఇంజినీర్ అయాన్ క్లార్క్ ఈ సందేశాన్ని బైనరీ కోడ్ (0,1) రూపంలో ప్యారాచూట్‌పై రాశారు. రోవర్ మార్స్‌పై దిగిన వీడియోను సోమవారం నాసా విడుదల చేయడం తెలిసిందే. ఆ వీడియోను పరిశీలించిన పలువురు ఔత్సాహికులు ఈ కోడ్ సందేశాన్ని గుర్తించి దాన్ని పరిష్కరించారు. ఆ రహస్య సందేశంలో ‘డేర్ మైటీ థింగ్స్’ అని రాసి ఉంది. అమెరికా 26వ అధ్యక్షుడు రూజ్వెల్ట్ ఒక సందర్భంలో చెప్పిన ‘ఫార్ బెటర్ ఇట్ ఈజ్ టు డేర్ మైటీ థింగ్స్, టు విన్ గ్లోరియస్ ట్రయంప్స్ (గొప్ప విజయాల కోసం క్లిష్టమైన పనులు చేయడానికి సాహసించాలి)’ వ్యాఖ్య నుంచి క్లార్క్ ఈ కోడ్‌ను ఎన్నుకొని అరుణ గ్రహంపైకి పంపాడు.