సోమవారం 01 జూన్ 2020
International - Apr 17, 2020 , 15:31:40

భూమికి తిరిగొచ్చిన ముగ్గురు వ్యోమ‌గాములు

భూమికి తిరిగొచ్చిన ముగ్గురు వ్యోమ‌గాములు

హైద‌రాబాద్‌: అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుంచి ఇవాళ ముగ్గురు వ్యోమ‌గాములు భూమికి చేరుకున్నారు.  నాసాకు చెందిన జెస్సికా మెయ‌ర్‌, ఆండ్రూ మోర్గ‌న్‌ల‌తో పాటు సోయేజ్ క‌మాండ‌ర్ ఒలెగ్ క్రిపోచ‌క‌లు ఇవాళ ఉద‌యం క‌జ‌క‌స్తాన్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. అంత‌రిక్ష కేంద్రంలో మోర్గ‌న్‌, మేయ‌ర్‌లు అనేక జీవ ప‌రిశోధ‌న‌లు చేశారు. ఆస్ట్రోనాట్ మోర్గ‌న్‌ గ‌త ఏడాది జూలై 20వ తేదీన  అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లారు. కొన్ని రోజుల క్రిత‌మే క‌జ‌కిస్తాన్‌లోని అంత‌రిక్ష కేంద్రం నుంచి సోయేజ్ వ్యోమ‌నౌక‌లో కొత్త‌గా ముగ్గురు ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే.  

ఆస్ట్రోనాట్ మోర్గ‌న్‌ సుమారు 272 రోజులు ఫ్ల‌యిట్ ఎక్స్‌పడిష‌న్‌లో ఉన్నాడు. భూమి చుట్టూ అత‌ను 4325 సార్లు భ్ర‌మించాడు. ఇది 115.3 మిలియ‌న్ల మైళ్ల‌తో స‌మానం. అయితే ఎక్కువ కాలం అంత‌రిక్షంలో ఉంటే.. మ‌న శ‌రీరంలో జ‌రిగే మార్పుల గురించి మోర్గ‌న్‌ను అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా తెలుస్తుంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఆస్ట్రో మోర్గ‌న్ 46 గంట‌ల పాటు స్పేస్‌వాక్‌ కూడా చేశాడు. ఇక మిగితా ఇద్ద‌రు వ్యోమ‌గాములు మేయ‌ర్‌, క్రిపోచ‌క‌లు గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 25న స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లారు. వాళ్లు 205 రోజుల పాటు అంత‌రిక్షంలో ఉన్నారు. భూమి చుట్టూ వాళ్లు 3280 సార్లు ఆర్బిట్ చేశారు.  


logo