మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 20, 2020 , 20:29:01

పాకిస్తాన్‌ నార్కో టెర్రరిజం.. భారత్‌లోకి పీవీసీ పైపుల్లో డ్రగ్స్‌ డంపింగ్‌!

పాకిస్తాన్‌ నార్కో టెర్రరిజం.. భారత్‌లోకి పీవీసీ పైపుల్లో డ్రగ్స్‌ డంపింగ్‌!

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ నార్కో టెర్రరిజానికి పాల్పడుతోంది. భారత్‌ సరిహద్దుల్లోకి పీవీసీ పైపుల్లో డ్రగ్స్‌ను డంప్‌ చేసేందుకు యత్నిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పీవీసీ పైపుల్లో తరలిస్తున్న62 కిలోల హెరాయిన్‌తోపాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బీఎస్‌ఎఫ్ సోమవారం ఉదయం  స్వాధీనం చేసుకుంది. 

జమ్ముఫ్రాంటియర్‌ బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎన్ఎస్ జామ్వాల్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 19, 20 మధ్య రాత్రి  42 బెటాలియన్ వద్ద పాకిస్తాన్ వైపు ఐబీ వెంట కొంత అనుమానాస్పద కదలికను గమనించినట్లు చెప్పారు. వెంటనే సరిహద్దు సైనికులను అప్రమత్తం చేశామన్నారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లను చూసి, వారు కాల్పులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, ఆత్మరక్షణలో బీఎస్ఎఫ్ దళాలు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాయన్నారు. వెంటనే వారు తిరిగి పాకిస్తాన్ వైపుకు పారిపోయారని జామ్వాల్‌ వెల్లడించారు. 

సోమవారం ఉదయం బుధ్‌వార్‌ సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టగా, భారత్‌  వైపు ఐబీ సమీపంలో 62 ప్యాకెట్ల హెరాయిన్‌తోపాటు రెండు చైనీస్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్స్, 9 ఎంఎం మందుగుండు సామగ్రి దొరికిందన్నారు. వీటిని రవాణా చేసేందుకు వారు పీవీసీ పైపులను ఉపయోగించారని వెల్లడించారు. ఇంతకుముందు కూడా పంజాబ్‌కు మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత వస్తువులను అక్రమంగా రవాణా చేయడానికి ఇదే విధమైన సాంకేతికతను వారు ఉపయోగించారని తెలిపారు. పైపుల ద్వారా సరిహద్దు దాటకుండానే మాదకద్రవ్యాలను భారత్‌లోకి డంప్‌ చేసేందుకు పాక్‌ యత్నిస్తోందన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo