శనివారం 30 మే 2020
International - May 06, 2020 , 01:22:05

రోజుకు 2 లక్షల కేసులు

రోజుకు 2 లక్షల కేసులు

  • మూడు వేల మరణాలు
  • జూన్‌ 1 నాటికి అమెరికాలో పరిస్థితిపై ఓ నివేదిక

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాపై విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతిని కొనసాగించనున్నదా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అంతర్గత నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. జూన్‌ 1 నాటికి అమెరికాలో రోజుకు 2 లక్షల మందికి చొప్పున వైరస్‌ సోకుతుందని, 3 వేల మంది చొప్పున మరణిస్తారని నివేదిక వెల్లడించింది. ఒకవైపు దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ 20కి పైగా రాష్ర్టాలు ఆర్థిక వ్యవస్థల్ని తెరిచాయని పేర్కొంది. జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లోని ఎపిడమాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జస్టిన్‌ లెస్లర్‌ అంచనాలతో ఈ నివేదికను రూపొందించినట్టు వెల్లడించింది. నివేదిక వివరాల్ని న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ వంటి పత్రికలు ప్రచురించాయి. అయితే శ్వేతసౌధం, యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీఎస్‌) అధికారులు నివేదికను తోసిపుచ్చారు. ఇది ప్రభుత్వం రూపొందించినది కాదని శ్వేతసౌధం ప్రతినిధి జుడ్‌ డీర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రముఖ వైద్య నిపుణుల సలహాల్ని, సూచనల్ని తీసుకున్న తర్వాతనే అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచేందుకు మార్గదర్శకాల్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధం చేశారన్నారు. మరోవైపు, నివేదిక తయారీలో తన పాత్ర లేదని జస్టిన్‌ లెస్లర్‌ పేర్కొన్నారు. 


logo