బుధవారం 03 జూన్ 2020
International - May 05, 2020 , 02:16:34

సడలింపుల దిశగా..

సడలింపుల దిశగా..

  • ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రపంచ దేశాల చర్యలు
  • ఇటలీలో 44 లక్షల మంది విధులకు
  • రష్యాలో రెండోరోజూ 10వేల కేసులు

రోమ్‌, మే 4: ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. యూరప్‌లో అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీలో దాదాపు రెండు నెలల సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత సోమవారం ప్రజల కదలికలపై నియంత్రణను తగ్గించారు. సోమవారం దాదాపు 44 లక్షల మంది తిరిగి తమ విధులకు హాజరయ్యారు. రోమ్‌లో ట్రాఫిక్‌ పెరిగింది. నిర్మాణ పనులు మొదలయ్యాయి. తయారీ యూనిట్లు తిరిగి తెరుచుకున్నాయి. మార్చి 11 తర్వాత తొలిసారి కాంపో డీ ఫ్లోరీ మార్కెట్‌కు పూల వ్యాపారులు చేరుకున్నారు. అంత్యక్రియలకు 15 మంది వరకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రెస్టారెంట్‌లలో ఆహారాన్ని కొని తీసుకెళ్లడానికి (టేక్‌అవే) మాత్రమే అనుమతి ఉన్నది. అయితే ఇప్పటికీ ప్రజలు తాము ఎందుకు బయటకు వచ్చారో తెలిపే ధ్రువపత్రాన్ని తమతోపాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు, గ్రీస్‌ ఏడువారాల లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా బయటకు వస్తున్నది. సోమవారం దుకాణాలతోపాటు హెయిర్‌సెలూన్లు తెరుచుకున్నాయి. స్పెయిన్‌లో సెలూన్లకు, రెస్టారెంట్‌లలో టేక్‌అవేకు అనుమతి ఇచ్చారు. పోర్చుగల్‌లో చిన్న దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చారు. ఆరువారాల తర్వాత ఐస్‌ల్యాండ్‌లో ఉన్నత పాఠశాలలు, సెలూన్లు, వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. సోమవారం నుంచి 30 శాతం మంది సిబ్బందితో రెస్టారెంట్లు తెరిచేందుకు లెబనాన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆంక్షల నడుమ వ్యాపారాలు నిర్వహిస్తే తమకు అధిక నష్టాలు వస్తాయని పేర్కొంటూ చాలా మంది యజమానులు రెస్టారెంట్‌లు తెరిచేందుకు నిరాకరిస్తున్నారు. 

రష్యాలో విజృంభణ

రష్యాలో కరోనా విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దవాఖానలపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తుండడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు చెప్తున్నారు. లాక్‌డౌన్‌ను మే 11 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 35.85 లక్షలకుపైగా కేసులు నమోదుకాగా, 2.48 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 67వేల మందికిపైగా మరణించారు.

జపాన్‌లో నెలాఖరు దాకా ఎమర్జెన్సీ

 కొవిడ్‌-19 వ్యాప్తి నివారణకు దేశంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు జపాన్‌ ప్రధాని షింజోఅబే సోమవారం ప్రకటించారు. దేశంలో కరోనా పరిస్థితులపై నిపుణుల కమిటీతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంలేదని, దవాఖానలపై ఇప్పటికే అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు. ఒకవేళ పరిస్థితులు మెరుగుపడితే మే మధ్యలో ఎమర్జెన్సీని ఎత్తివేసే అవకాశం కూడా ఉన్నదని వెల్లడించారు.


logo