శనివారం 08 ఆగస్టు 2020
International - Jul 15, 2020 , 13:27:20

అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌.. తొలిద‌శ‌ ప‌రీక్ష స‌క్సెస్‌

అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌.. తొలిద‌శ‌ ప‌రీక్ష స‌క్సెస్‌

హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ .. ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన కోవిడ్‌19 వ్యాక్సిన్ తొలి ద‌శ పరీక్ష‌లో స‌క్సెస్ సాధించింది. వ్యాక్సిన్ తీసుకున్న‌వారు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తేలింది.  45 మంది హెల్త్ వాలంటీర్లు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే యాంటీబాడీలు అధిక స్థాయిలో త‌యారైన‌ట్లు అమెరికా ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.  ఈ విష‌యాన్ని న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్ర‌చురించారు. హెల్త్ వాలంటీర్లకు రెండు డోస్‌ల వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు.  అయితే కోవిడ్‌19 నుంచి కోలుకున్న‌వారి కంటే.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్లు గుర్తించారు. 

మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవ‌రికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ న‌మోదు కాలేదు. కానీ టీకా కుచ్చిన ప్రాంతంలో కొంత నొప్పి వ‌చ్చిన‌ట్లు వాలంటీర్లు తెలిపారు.  కొంద‌రికి స్వ‌ల్ప స్థాయిలో త‌ల‌నొప్పి, వ‌ణుకుడు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. అమెరికా కంపెనీలు వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్నం అయ్యాయి.  మార్చి 16వ తేదీన మోడెర్నా కంపెనీ మాన‌వుల‌పై వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు మొద‌లుపెట్టింది. క‌రోనా జ‌న్యువు క్ర‌మాన్ని రిలీజ్ చేసిన 66 రోజుల్లోనే ఆ కంపెనీ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ చేప‌ట్ట‌డం విశేషం.   

వ్యాక్సిన్ త‌యారీలో మోడెర్నా బ‌యోటెక్ కంపెనీ శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటు అమెరికా ప్ర‌భుత్వానికి చెందిన అంటువ్యాధుల సంస్థ శాస్త్ర‌వేత్త‌లు కూడా పాల్గొన్నారు. అయితే జూలై 27వ తేదీన మూడ‌వ ద‌శ వ్యాక్సిన్ ప‌రీక్ష‌ల‌ను భారీ స్థాయిలో చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆ కంపెనీ తెలిపింది. మూడ‌వ ద‌శ‌లో సుమారు 30 వేల మందిని ప‌రీక్షించ‌నున్నారు.  అయితే ఆ ప‌రీక్ష ఫ‌లితాలు అక్టోబ‌ర్ వ‌ర‌కు వెల్ల‌డి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ స‌మ‌యానికి మోడెర్నా వ్యాక్సిన్ సుర‌క్షిత‌మైందా కాదా అని ఇప్పుడే తేల్చ‌లేమ‌న్నారు.

logo