బీజింగ్: ఒక అల్లరి బాలుడు తన తల్లి మెడకు సైకిల్ లాక్ వేశాడు. అయితే ఆ లాక్‌ను తెరిచే కోడ్‌ను మరిచిపోయాడు. దీంతో భయాందోళన చెందిన ఆ తల్లి అధికారుల సహాయం కోరింది. చివరకు కట్టర్‌తో కట్ చేసి దానిని తొలగించారు. చైనా జియాంగ్సు ప్రావిన్స్‌లోని హువాన్‌లో ఈ నెల 7న ఈ ఘటన జరిగింది. సైకిల్ లాక్‌తో ఆడుకుంటున్న ఒక బాలుడు సరదాగా తల్లి మెడకు దానిని తగిలించి లాక్ వేశాడు. అయితే ఆట సమయంలో అన్ లాక్ కోడ్‌ను అతడు పలు మార్లు మార్చేశాడు.
ఈ విషయాన్ని గుర్తించిన ఆ తల్లి, లాక్ తెరిచే కాంబినేషన్ తెలియక కంగారు పడింది. సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సహాయం కోరింది. వారు అగ్నిమాపక బృందాన్ని పిలిపించారు. ఒక టవల్‌ను ఆమె మెడకు ఉంచి వైర్ కట్టర్‌తో సైకిల్ లాక్‌ను కట్ చేసి తొలగించారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలుడి అల్లరి పనిపై కొందరు నెటిజన్లు నవ్వుకోగా మరి కొందరు మండిపడ్డారు. పిల్లలను హద్దుల్లో ఉంచాలని మరి కొందరు పేర్కొన్నారు.