సోమవారం 06 జూలై 2020
International - May 30, 2020 , 01:28:16

జాతివివక్షపై సమరం అమెరికాలో ఉద్యమం హింసాత్మకం

జాతివివక్షపై సమరం అమెరికాలో ఉద్యమం హింసాత్మకం

  • జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై తీవ్ర నిరసన 
  • మిన్నెపోలిస్‌ పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు  
  • పలు దుకాణాలు, మాల్స్‌ ధ్వంసం  
  • నిరసనకారులంతా గజదొంగలు: ట్రంప్‌ 

మిన్నెపోలిస్‌/లూయిస్‌విల్లే, మే 29: జాతివివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో మొదలైన ఉద్య మం హింసాత్మక రూ పం దాల్చింది. మిన్నెసోటా రాష్ట్ర రాజధాని, జంటనగరాలైన మిన్నెపోలీస్‌, సెయింట్‌ పాల్‌లో వరుసగా నాలుగో రోజూ వేలాది మంది నల్లజాతీయులు, శ్వేతజాతీయులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. వీరిలో కొందరు విధ్వం సం సృష్టించారు. ఏకంగా మిన్నెపోలిస్‌ పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. మిన్నెపోలిస్‌తోపాటు సెయింట్‌పౌల్‌ నగరంలోని పలు దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌పై విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. పలు వాహనాలను దగ్ధం చేశారు. ఈ నిరసనలు క్రమంగా సమీపంలోని పట్టణాలు, నగరాలకు కూడా పాకుతున్నాయి. ఒహియోలోని డౌన్‌టౌన్‌లో రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. సోమవారం జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని శ్వేతజాతీయుడైన పోలీస్‌ ఆఫీసర్‌ డెరెక్‌ చౌవిన్‌ అత్యంత అమానవీయంగా మెడపై మోకాలిని నొక్కిపెట్టి చంపిన సంగతి తెలిసిందే.


దీంతో జాతివివక్షను నిరసిస్తూ మరోసారి ఉద్యమం మొదలైంది. ముందస్తు జాగ్రత్త చర్యగా మిన్నెపోలిస్‌ పోలీసులు అనేక దుకాణాలను, మాల్స్‌ను ఆదివారం వరకు మూసివేయించారు. ఉద్యమకారులు రాత్రి 10 గంటలకు థర్డ్‌ పర్సెంట్‌ ప్రాంతంలోని మిన్నెపోలిస్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. సామగ్రిని ధ్వంసం చేసి, తర్వాత స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అనంతరం ఆ ప్రాంతంలోని పలు దుకాణాలను లూటీ చేశారు. దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు. దీంతో జంట నగరాల్లో పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ‘మమ్మల్నే ఎందుకు?’,‘స్వేచ్ఛ ఇవ్వండి లేదా న్యాయం చేయండి’అంటూ గోడలపై పెద్ద అక్షరాలతో నినాదాలు రాశారు. సమానత్వం ఇంకెప్పుడు? ఇంకా ఎన్నేండ్లు మేము లక్ష్యంగా మారాలి? అంటూ ప్రశ్నించారు. మరోవైపు వందల మంది నిరసనకారులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌, రబ్బర్‌ బులెట్లు ప్రయోగించారు. దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఫ్లాయిడ్‌ను హత్యచేసిన అధికారి డెరెక్‌ చౌవిన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ‘ఫ్లాయిడ్‌కు న్యాయం జరుగడంతోపాటు మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేలా ఉద్యమం జరుగాలి’అని సెయింట్‌ పాల్‌ నగర మేయర్‌ మెల్విన్‌ కార్టర్‌ ట్వీట్‌ చేశారు.

లూయిస్‌ విల్లేలో కాల్పులు 


కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌ విల్లేలో జరిగిన నల్లజాతీయుల నిరసనలో కాల్పులు జరిగాయి. కనీసం ఏడుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయని పోలీసులు శుక్రవారం ఉదయం తెలిపారు. ఈ ఏడాది మార్చి 13న లూయిస్‌ విల్లేలో బ్రియోన్నా టేలర్‌ (23) అనే నర్సును మాదక ద్రవ్యాల నిరోధక బృందం ఆమె ఇంట్లోనే కాల్చి చంపింది. అయితే ఆమె ఇంట్లో ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు గత నెల పోలీసులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో టేలర్‌కు న్యాయం చేయాలంటూ కొన్నాళ్లుగా ఉద్యమం నడుస్తున్నది.

ఆజ్యం పోస్తున్న ట్రంప్‌ వ్యాఖ్యలు

ఫ్లాయిడ్‌ మరణంతో చెలరేగిన ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రవర్తిస్తున్నారు. దుకాణాలను లూఠీ చేస్తున్నవారంతా ‘గజదొంగలు’ అని వ్యాఖ్యానించారు.‘ఫ్లాయిండ్‌ జ్ఞాపకాలను ఈ గజదొంగలు అగౌరవపరుస్తున్నారు. దీనిని నేను సహించను’ అంటూ ట్వీట్‌ చేశారు. పాలనా యంత్రాంగం వైఫల్యం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని విమర్శించారు. ‘నేను గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌తో మాట్లాడాను. అవసరమైతే సైన్యాన్ని పంపుతానని చెప్పాను. పరిస్థితి ఎలా ఉన్నా అదుపు చేయగలం. కానీ లూటీ చేయడం మొదలైతే.. కాల్పులు మొదలవుతాయి’ అని ట్వీట్‌ చేశారు. గజదొంగలు అనే పదం వాడటంపై ట్విట్టర్‌ సంస్థ అభ్యంతరం తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ హెచ్చరిస్తూ ట్వీట్‌ను‘హైడ్‌' చేసింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇన్నాళ్లూ నల్లజాతీయులను చంపినవారికి పదోన్నతులు ఇచ్చిన ఆయన ఎన్నికల నేపథ్యంలో తొలిసారి పోలీసులపై విచారణకు ఆదేశించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. 

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ నుంచి ఫ్లాయిడ్‌ వరకు 

అమెరికా సమాజంలో జాతివిక్ష నరనరాన జీర్ణించుకుపోయింది. నల్లజాతీయులపై శతాబ్దాలుగా జాతివివక్ష కొనసాగుతున్నది. కొందరు శ్వేతజాతీయులు వారిని ఇప్పటికీ నేరగాళ్లుగానే చూస్తారు. ముఖ్యంగా పోలీసుల్లో ఈ భావన బలంగా పాతుకుపోయింది. అందుకే అరెస్ట్‌లకు బదులు కాల్చి చంపేస్తున్నారు. అమెరికన్‌ గాంధీగా పిలిచే నల్లజాతీయుడైన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ 1963లో ఓ ప్రసంగం చేశారు.‘నా నలుగురు పిల్లలు ఒకరోజున శరీర వర్ణం వల్ల కాకుండా వ్యక్తిత్వం వల్ల గుర్తింపు పొందే సమాజంలో బతుకాలని కోరుకుంటున్నా’ అని తన కల గురించి చెప్పారు. అది ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ఆయన ఓ శ్వేతజాతీయుడి చేతిలో హత్యకు గురయ్యారు. ఒబామా వంటివారు అధ్యక్షులుగా ఎన్నికైనా.. ఎన్నో కఠిన చట్టాలు ఉన్నా దీనికి చరమగీతం పాడలేకపోయారు. ట్రంప్‌ ఏకంగా జాతివివక్ష నినాదంతోనే గద్దెనెక్కారు. ఆయన ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో నల్లజాతీయులు, భారతీయులపై జరిగిన దాడులకు లెక్కేలేదు. 2017లో జరిగిన విద్వేష కాల్పుల్లో తెలుగువారైన శ్రీనివాస్‌ కూచిబొట్ల మరణించగా, అలోక్‌ గాయపడ్డారు. ఇటీవలే ఓ హిందూ పూజారిపైనా దాడి జరిగింది. 


logo