మంగళవారం 19 జనవరి 2021
International - Jan 07, 2021 , 19:12:24

ట్రంప్‌కు నమ్మిన బంటు చెక్‌.. బిడెన్‌కే మైక్‌ పెన్స్‌ ఓటు

ట్రంప్‌కు నమ్మిన బంటు చెక్‌.. బిడెన్‌కే మైక్‌ పెన్స్‌ ఓటు

వాషింగ్టన్‌: పరిస్థితులు విషమించినప్పుడు.. ఉన్మాదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఆత్మీయులు.. అత్యంత సన్నిహితులు సైతం దూరం అవుతారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఇది స్పష్టంగా కానవస్తుంది. ప్రపంచానికే ప్రజాస్వామ్య సూక్తులు వల్లించే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టడంతో ఆయన మద్దతు దారులు ఏకంగా చట్టసభల భవనం ‘క్యాపిటల్‌ బిల్డింగ్‌’ మీద దాడి చేసే దుస్థితి ఏర్పడింది.

ఈ తరుణంలో నాలుగేండ్లుగా ట్రంప్‌కు నమ్మిన బంటుగా పని చేస్తూ వచ్చిన రిపబ్లికన్‌ పార్టీ నేత, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరిచారు. గత ఏడాది నవంబర్‌ నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడానికి నిరాకరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భిన్నంగా బుధవారం అమెరికా కాంగ్రెస్‌ సమావేశంలో మైక్‌ పెన్స్‌ వ్యవహరించారు. అగ్రరాజ్యం నూతన అధ్యక్షుడిగా జో బిడెన్‌ ఎన్నికను అమెరికా కాంగ్రెస్‌ ధ్రువీకరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాజ్యాంగ నిబద్ధతకు కట్టుబడి పని చేశారు.

అమెరికా కాంగ్రెస్‌, సెనెట్‌ సంయుక్త సమావేశంలో అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్‌ ఎన్నికను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి ప్రిసైడింగ్‌ అధికారిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తారు. గత నాలుగేండ్లలో ఏనాడూ ట్రంప్‌ నిర్ణయాలను, విధానాలను ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వ్యతిరేకించలేదు.

తొలి నుంచి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్‌.. తాజాగా చట్టసభల సంయుక్త సమావేశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించారు. ఈ ఎన్నికను తోసిరాజనే అధికారం పెన్స్‌కు ఉందని, సమావేశానికి ముందు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

అయితే ట్రంప్‌ అభ్యంతరాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటిస్తూనే.. ఎలక్టోరల్‌ కాలేజీకి వచ్చిన ఓట్లను, ఎలక్టోరల్‌ కాలేజీ నిర్ణయాన్ని తోసిపుచ్చలేనని, తనకు ఆ అధికారం లేదని మైక్‌ పెన్స్‌ ప్రకటించారు. తద్వారా జో బిడెన్‌ దేశాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 

అంతకుముందు ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ బిల్డింగ్‌లోకి దూసుకువచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను సవాల్‌ చేసేందుకు సిద్ధమైన రిపబ్లికన్ పార్టీ చట్టసభ ప్రతినిధులకు మద్దతుగా ట్రంప్‌ మద్దతుదారులు వ్యవహరించారు. ఈ క్రమంలో ఆగంతకుల మధ్య చిక్కుకున్న మైక్‌ పెన్స్‌.. సంయుక్త సమావేశం ముగిసిన తర్వాత సెనెట్‌ చాంబర్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.