శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 15:06:23

కుటుంబాన్ని క‌లిపిన క‌రోనా...!

కుటుంబాన్ని క‌లిపిన క‌రోనా...!

ప్ర‌పంచ దేశాలు క‌రోనాతో గ‌డ‌గ‌డ‌లాడుతున్నాయి. ఎంతో మంది జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. వేలాది కుటుంబాలు రోడ్డున‌ప‌డుతున్నాయి. కోవిడ్ వైర‌స్ గురించి వింటేనే గుండెగుబేల్ మంటుంది. ఇదంతా ఒక‌టైతే..ఓ వ్య‌క్తికి మాత్రం క‌రోనా వ‌రంలా మారింది. ఎంత‌లా అంటే ఎన్నో ఏండ్ల పాటు మ‌ర్చిపోయిన‌ త‌న గ‌తాన్ని గుర్తుకు తెచ్చింది. అవును మీరు వింటుంది నిజ‌మే. క‌రోనా ప్రాణాలు తీస్తుంది కాని గ‌తం  గుర్తుకు తేవడం ఏమిటనుకుంటున్నారా..?  మీకు ఎన్ని డౌట్లు వచ్చినా.. ఇదిమాత్రం నిజం..! మతిమరుపుతో కుటుంబానికి దూరమైన వ్యక్తి 30 ఏళ్ల తరువాత మళ్లీ తన కుటుంబాన్ని కలుసుకోబోతున్నాడు. ఇదంతా కూడా క‌రోనా పురుడుపోసుకున్న చైనాలోనే జ‌రిగింది.

చైనా గియిజు ప్రావిన్స్‌లోని చిషు గ్రామానికి చెందిన 57 ఏళ్ల జు జియామింగ్‌ 1990లో ఉపాధి కోసం హుబెయి ప్రావిన్స్‌కు వ‌ల‌స‌ వెళ్లాడు.  అక్క‌డ పనిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అదే ఏడాది త‌ను ప‌నిచేస్తున్న ద‌గ్గ‌ర జ‌రిగిన ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో మెద‌డుకు దెబ్బ‌త‌గ‌ల‌డంతో అత‌డు గ‌తాన్ని మ‌ర్చిపోయాడు. అయితే జుజియామింగ్ శారీరకంగా కోలుకున్నా.. మెద‌డుకు త‌గిలిన దెబ్బ‌తో తానేవ‌రో, త‌న ఊరు, కుటుంబ‌మేంటో పూర్తిగా మ‌ర్చిపోయాడు. దీనికి తోడు అతడి గుర్తింపు కార్డు పోవడంతో  నిరాశ్రయుడిగా మిగిలిపోయాడు. నిలువ నీడలేకుండా దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇదే సమయంలో ఓ కుటుంబం జియామింగ్‌ను చేరదీసింది.  వారి కుటుంబంలో ఒక‌డిగా భావించి అత‌డికి తోడుగా నిలిచింది. అయిన‌ప్ప‌ట‌కి   తన స్వగ్రామం, కుటుంబం, మర్చిపోయిన గతం గురించి తీవ్రంగా ఆలోచించేవాడు. ఇలా ఎంత ప్రయత్నించినా త‌న పూర్వ‌స్థితి గురించి గుర్తుకు వచ్చేది కాదు.  ఇలా చాలా సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. ఇక జియామింగ్‌ను చేర‌దీసిన కుటుంబం 2015లో హిజియంగ్ ప్రావిన్స్ లోని  యునెకు మారారు. 2015 నుంచి ఇక్క‌డే ఉంటున్నారు. యునె ప్రాంతం జియ‌మింగ్ సొంతగ్రామానికి 1500 కి.మీ దూరంలో ఉంది. 

ఇటీవ‌ల చైనాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డ‌టంతో వేలాది మంది మ‌ర‌ణించారు. దేశంలో ఎక్కడెక్కడ కరోనా మరణాలు సంభ‌వించాయో పూర్తి వివ‌రాల‌తో వార్తలో వివరించారు. ఈ క్ర‌మంలో జియామింగ్‌ సొంత ఊరు చిఘలో ఒకరు మృతిచెందడంతో.. ఆ ఊరిపేరు వార్తల్లో వచ్చింది. ఆ వార్త‌ను  చూసిన జియమింగ్‌ తన గ్రామమేనని గుర్తుపట్టాడు. దీంతో ఆ వెంటనే అతనికి గతం గుర్తుకు వచ్చింది. ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు తెలిపాడు. పోలీసుల‌కు త‌న గ‌తాన్ని వివ‌రించాడు. వెంట‌నే స్పందించిన పోలీసులు అతడి కుటుంబ సభ్యుల చిరునామా, వివరాలు తెలుసుకొని వీడియోకాల్‌ ద్వారా జియామింగ్‌ను తన తల్లితో మాట్లాడించారు.  ఇన్నాళ్లూ తన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జియామింగ్‌ తెలుసుకున్నాడు. అతడికి నలుగురు తోబుట్టువులు. 18 ఏళ్ల క్రితం అతడి తండ్రి మరణించాడు. జియామింగ్‌ ఆచూకీ లభించకపోవడంతో అతడి తల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. చాలా కాలం అతడి కోసం అన్వేషించినా ఫలితం లేకపోవడంతో కేసును కూడా కొట్టేశారు. ఇప్పుడు అతడి ఆచూకీ లభించడంతో కుటుంబమంతా సంతోషంతో ఉంది. తన కల నిజమైందని.. కుటుంబసభ్యులను క‌లుస్తున్నందుకు ఆనందం వ్య‌క్తం చేశాడు.  ప్రస్తుతం పోలీసులు జియామింగ్‌ను అతడి కుటుంబాన్ని కలిపే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి  కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తుంటే.. జియామింగ్‌కు మాత్రం తన కుటుంబాన్ని కలిపింది. ఈ వార్త ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.logo