సోమవారం 30 మార్చి 2020
International - Mar 13, 2020 , 19:07:37

కరోనా వైరస్ అమెరికా సైన్యం పనే

కరోనా వైరస్ అమెరికా సైన్యం పనే

కరోనా బీభత్సాన్ని వర్ణించేందుకు మహమ్మారి అనే పదం సరిపోవడం లేదు. దాదాపుగా ప్రపంచమంతా పాకి వణికిస్తున్న వైరస్ కల్లోలంపై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కోవిడ్-19 వైరస్‌ను అమెరికా వూహాన్ వైరస్ అని పదేపదే చైనాయే మూలమన్నట్టు ప్రకటనలు చేస్తున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇది విదేశీ వైరస్ అని నొక్కిచెప్తున్నారు. ప్రస్తుతం చైనాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఇతర దేశాల్లో వైరస్ సరవేగంగా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనా లేదా కోవిడ్-19 జన్మస్థలం వూహాన్ కాదని చైనా గట్టిగా ప్రచారం చేస్తున్నది. బయటినుంచే వచ్చిందనే ధోరణిలో ప్రకటనలు చేస్తున్నది. తాజాగా చైనా విదేశాంగ ప్రతినిధి జావ్ లిజియాన్ ఒకడుగు ముందుకు వేసి  అమెరికా సైన్యం వూహాన్‌పై కోవిడ్-19ను ప్రయోగించిందని బాంబు లాంటి మాట విసిరారు. నిజానికి ప్రతియేటా శీతాకాలంలో అన్నిదేశాల్లాగే అమెరికాలోనూ ప్లూ జ్వరాలు వస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు లేనివారు సులభంగానే బయటపడుతుంటారు. వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు మృత్యువు బారిన పడుతుంటారు. గత శీతాకాలంలో అమెరికాలో 3.4 కోట్లమందికి ఇన్‌ఫ్లూయంజా సోకగా వారిలో 20 వేలమంది మృత్యువాత పడ్డారు. అయితే అందులో కొన్ని కోవిడ్-19 కేసులు లేకపోలేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ప్రతినిధుల సభ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

చైనాలో డిసెంబర్ లో మాత్రమే కరోనా మొదటిసారిగా కనిపించింది. సీడీసీ అధిపతి వాంగ్మూలం అంతకుముందే అమెరికాలో కోవిడ్ ఉందనే అనుమానాలు కలిగిస్తున్నది. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి జావ్ లిజియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మృతులు ఎందరుంటారో చెప్పగలరా? అని ఆయన ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. అమెరికా సైన్యం ఈ మహమ్మారిని వూహాన్ లో ప్రవేశపెట్టి ఉంటుందని సందేహం  వ్యక్తం చేశారు. అయితే అందుకు ఆయన ఎలాంటి ఆధారాలు ఉదహరించలేదు. చైనా వ్యాధి నియంత్రణ విభాదం అధికారి గావ్ ఫూ వైరస్ వూహాన్‌లోనే మొదలైందని చేసిన ప్రకటనకు ఇది భిన్నంగా ఉండడం గమనార్హం. కానీ తర్వాత ఇతర చైనా అధికారులు భిన్నస్వరాలు వినిపించారు. గత నెల నుంచి చైనా వూహాన్ వైరస్ జన్మస్థలం కాదనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. చైనాలో మొదట కనిపించింది కానీ చైనాలోనే పుట్టి ఉండకపోవచ్చని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సభ్యుడు జోంగ్ నాన్షాన్ అభిప్రాయపడ్డారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు చైనాలో మొదలైన మహమ్మారి అనే మాటలతో మొదలుపెట్టిన టీవీ ప్రసంగం చైనాకు కోపం తెప్పించిందని విదేశాంగ ప్రతినిధి ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ వైరస్ వ్యవహారంలో జాతివివక్ష ఆరోపణలకు తావు ఇవ్వరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు పలికింది. వైరస్ ఎక్కడ పుట్టింది అనేది కాదు.. దానిని ఎలా అంతం చేయాలనేది నేటి ప్రాధాన్యత కావాలి.  


logo