గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 15, 2020 , 02:31:52

సీఏఏ పరిణామాలు బాధాకరం

సీఏఏ పరిణామాలు బాధాకరం
  • ఓ బంగ్లాదేశీని ఇన్ఫోసిస్‌ సీఈవోగా చూడాలనుంది
  • హైదరాబాద్‌లో క్రిస్మస్‌, దీపావళి వంటి అన్ని పండుగలు జరుపుకొనేవాళ్లం
  • అమెరికా వలస విధానం నాకు అవకాశం కల్పించింది
  • మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల

న్యూయార్క్‌, జనవరి 14: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. సీఏఏపై భారత్‌లో జరుగుతున్నది ‘బాధాకరం’ అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చే ఓ బహుళజాతి కంపెనీకి బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వ్యక్తి సారథ్యం వహిస్తే చూడాలని ఉం దన్నారు. ప్రతి దేశం తమ జాతీయ భద్రతను సంరక్షించుకోవాలని, అందుకనుగుణంగా వలస విధానాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. న్యూయార్క్‌లో మైక్రోసాఫ్ట్‌ నిర్వహించిన ఎడిటర్స్‌ సమావేశంలో నాదెళ్ల మాట్లాడారు. ఈ సందర్భంగా సీఏఏ విషయంలో బజ్‌ఫీడ్‌ వార్తా సంస్థ ప్రధాన సంపాదకులు బెన్‌ స్మిత్‌ అడిగిన ఒక ప్రశ్నకు సత్యనాదెళ్ల పై విధంగా సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బెన్‌ స్మిత్‌ నాదెళ్ల ఇచ్చిన సమాధానం పూర్తి పాఠాన్ని మంగళవారం విడుదల చేశా రు. దీని ప్రకారం, ‘నేను భారత్‌లో పుట్టి పెరిగాను. నా వారసత్వం పట్ల గర్వంగా ఉంది. నే ను పెరిగిన నగరం (హైదరాబాద్‌)లో క్రిస్మస్‌, దీపావళితోపాటు అన్ని ముఖ్య పండుగలను చేసుకునేవాళ్లం. సీఏఏ విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది బాధాకరం. అమెరికాలోని సాంకేతిక పరిజ్ఞానం నన్ను ఆకర్షించింది, దాని వలస విధానం నాకు ఇక్కడ (అమెరికాలో) అవకాశం కల్పించింది. అలాగే ఓ బంగ్లాదేశీ భారత్‌కు వచ్చి ఓ యూనికార్న్‌ సంస్థను స్థాపించడమో లేక ఇన్ఫోసిస్‌కు సీఈవోగా బాధ్యతలు చేపట్టడమో చూడాలనుంది.


అమెరికాలో నా విషయంలో సాధ్యమైంది భారత్‌లో మరొకరికి సాధ్యం కావాలని ఆకాంక్షిస్తున్నా. ఓ దేశం తన జాతీయ భద్రతపై శ్రద్ధ చూపకూడదన్నది నా అభిప్రాయం కాదు. సరిహద్దులనేవి ఉంటాయి, అవి వాస్తవమైనవి, ప్రజలకు వాటి గురించి తెలుసు. ఇటు అమెరికాలో, అటు యూరప్‌లో వలసలు పెద్ద సమస్యగా పరిణమించాయి. భారత్‌లో కూడా ఈ సమస్య ఉంది. అయితే వలసలంటే ఏమిటి, వలస వచ్చే వారెవరు, మైనారిటీ గ్రూపులు ఏవి అన్నది తెలుసుకొని, వాటి విషయంలో వ్యవహరించే తీరుపై సమస్య పరిష్కారం ఆధారపడి ఉంటుంది. గందరగోళ ప్రజాస్వామ్యమై న భారత్‌లో ఎట్టకేలకు ఓ అంశం (వలసల)పై చర్చ జరుగడం మంచి పరిణామం’ అని సత్య నాదేళ్లఅన్నారు. ‘ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి.. వాటిని అవి నిర్దేశించుకోవాలి. దేశభద్రతను రక్షించుకోవాలి, అందుకనుగుణంగా వలస విధానాన్ని రూపొందించాలి. ప్రజాస్వామిక దేశాల్లో, అక్కడి ప్రభుత్వాలు, ప్రజలు దీనిపైనే చర్చిస్తారు’ అని నాదెళ్ల పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి స్పందిస్తూ, నాదెళ్ల వ్యాఖ్యలు అక్షరాస్యులకు జ్ఞానోదయం కలిగించే మాటలు అని పేర్కొన్నారు.
Nadendla1

ప్రతిపక్షాల ఐక్యత ముఖ్యం: అమర్త్యసేన్‌

సీఏఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ .. ఓ సదుద్దేశం కోసం జరిపే ఎటువంటి నిరసన కార్యక్రమన్నైనా నిర్వహించేందుకు ముందు గా ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని చెప్పారు. అప్పుడే నిరసనలు సులభతరంగా జరుగుతాయని చెప్పారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకున్నా నిరసనలు కొనసాగవచ్చన్నారు. సరైన కారణం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండాలన్నారు. 


logo