బుధవారం 03 జూన్ 2020
International - May 11, 2020 , 15:51:35

వింత..నీళ్లలా పాకుతున్న మంటలు..

వింత..నీళ్లలా పాకుతున్న మంటలు..

హైదరాబాద్: మాయాబజార్‌లో ఘటోత్కచుని ఆశ్రమప్రాంతంలోకి ప్రవేశించిన సుభద్ర, అభిమన్యుల రథాన్ని మంటలు చుట్టుముట్టే సీన్ ఎవరూ మరచిపోరు. అది రాక్షసమాయకు సంబంధించిన సినిమా ఎఫెక్టు. కానీ ఓ పార్కులో వ్యాపించిన మంటలు వ్యాపించిన వీడియోచూసినవారికి దిమ్మతిరిగిపోయింది. ప్రపంచవ్యాప్యంగా లక్షల మంది వీక్షించి ఔరా అని అబ్బురపడి ముక్కుమీద వేలేసుకునేలాచేసింది. మంటల దుప్పటి క్రమంగా పార్కు అంతటా వ్యాపిస్తుంది. కానీ కింద గడ్డికి ఏమీ కాదు. చెట్లూ చెక్కుచెదరవు. పార్కులోని బెంచీలకు మంటలు అంటుకోవు. పోప్లార్ చెట్ల నుంచి రాలిపడిన విత్తనాలు, దుబ్బు మాత్రమే కాలిపోయి మిగిలినదంతా సురక్షితంగాఉండడం చూస్తే మంత్రి ముగ్ధుల్ని చేసి, ఇదేదో ఇంద్రజాలం అనిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నాలుగు రోజులకే 92 వేలమంది చూశారు. రెడ్డిట్, ట్విట్టర్‌లో కూడా ఇది హల్‌చల్ చేసింది. ట్విట్టర్ లో ఏకంగా 68 లక్షల మంది దీనిని వీక్షించి అబ్బురపడ్డారు. స్పెయిన్‌లోని కాలహోరాలోని ఓ పార్కులో ఈ వీడియో తీశారు. ముందుగా క్లబ్ దె మొంటానా కాలహోరా అనే స్వచ్ఛంద సంస్థ దానిని ఫేస్‌బుక్‌లో పెట్టింది. తర్వాత ఇతర సోషల్ మీడియాల్లోకి ప్రవేశించి దుమ్మురేపింది.


logo