లండన్: కోవిడ్ టీకా వేసుకున్న మహిళల రుతు క్రమంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ అంశంపై కొన్ని డౌట్స్ వ్యక్తం అయ్యాయి. ఆ అనుమానాలపై మరింత లోతైన అధ్యయనం చేపట్టాలని బ్రిటీష్ మెడికల్ జర్నల్ తన ఎడిటోరియల్‌లో అభిప్రాయపడింది. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో కలిగే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ గురించి బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) ఓ నివేదికను విడుదల చేసింది. భుజం నొప్పి, జ్వరం, నీరసం, కండరాల నొప్పులు సాధారణంగా ఉన్నట్లు ఆ రిపోర్ట్‌లో చెప్పారు. కానీ మహిళల్లో కలిగే రుతుక్రమ మార్పులు కానీ ఆకస్మికంగా కలిగే రక్తస్త్రావం గురించిన విషయాలను ఆ నివేదికలో వెల్లడించలేదు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో రిప్రొడెక్టివ్ స్పెషలిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ విక్టోరియా మేల్ మాత్రం రుతుక్రమ సమస్యలపై స్పందించారు. టీకా తీసుకున్న మహిళలు రుతుక్రమ మార్పులపై డాక్టర్లను సంప్రదిస్తున్నట్లు తన రిపోర్ట్‌లో తెలిపారు.
డ్రగ్ రియాక్షన్ కింద సుమారు 30వేల రిపోర్ట్‌లను ఎంహెచ్ఆర్ఏకు అందించారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పీరియడ్‌లో మార్పు వచ్చినట్లు చెబుతున్నవారు.. ఆ తర్వాత నెలలో రుతుక్రమం సాధారణంగా జరిగినట్లు వెల్లడించారు. స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై టీకా ప్రభావం ఉందని చెప్పడానికి ఆధారాలు లేవని కూడా తేల్చారు. టీకా తీసుకున్నవారిలో, తీసుకోనివారిలో.. యధావిధిగా ప్రెగ్నెన్సీ రేటు ఉన్నట్లు ఎంహెచ్ఆర్ఏ రిపోర్ట్‌లో స్పష్టమైంది.
టీకాతో రుతుక్రమంలో స్వల్ప మార్పు జరిగినా.. భవిష్యత్తులో మాత్రం టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రుతుక్రమంపై పడే ప్రభావం గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని విక్టోరియా మేల్ అభిప్రాయపడ్డారు. టీకాకు, నెలసరికి లింకు లేకున్నా.. ఎంహెచ్ఆర్ఏ ఇచ్చిన డేటా కొంత తికమకగా ఉందని, అందుకే ఈ అంశంలో పూర్తి స్థాయి అధ్యయనం చేపట్టాలన్న అభిప్రాయాన్ని విక్టోరియా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో, టీకా వేసుకోని వారిలో రుతుక్రమ మార్పులను స్టడీ చేయాలన్నారు. ఎంఆర్ఎన్ఏ, అడినోవైరస్ టీకాలు తీసుకున్న మహిళల రుతుక్రమంలో స్వల్ప మార్పులు గమనించినట్లు స్టడీలో తెలిపారు.
టీకా తీసుకోకున్నా.. సార్స్ సీవోవీ2 వైరస్ సోకిన మహిళల్లోనూ నెలసరి మార్పులు జరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు. రుతుక్రమంలో కలిగే మార్పుల గురించి రిపోర్ట్ చేసేలా డాక్టర్లు తమ పేషెంట్లను ఎంకరేజ్ చేయాలని విక్టోరియా సూచించారు.