న్యూ జెర్సీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏం చేసినా విశేషమే..ఆయన తన 75వ జన్మ దినోత్సవ వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. తన జన్మ దిన వేడుకల సందర్భంగా ఆయన సోమవారం రాత్రి న్యూ జెర్సీ-బెడ్ మినిస్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో బంధు మిత్రులకు విందునిచ్చారు.
గమ్మత్తేమిటంటే డోనాల్డ్ ట్రంప్ జన్మ దిన వేడుకలకు గైర్హాజరైన ప్రముఖుల్లో ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా ఉండటమే. అలాగే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నప్పుడు సలహాదారుగా ఉన్న ఆయన గారాల పట్టి ఇవాంక ట్రంప్ కూడా కనిపించక పోవడం ట్విస్ట్‌గా మారిందంటున్నారు.
డొనాల్డ్ జూనియర్, ఆయన గర్ల్ ఫ్రెండ్ కింబర్లీ గైల్ఫోయల్, మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ హెర్చెల్ వాకర్, ఇండియానా కాంగ్రెస్ మెన్ జిమ్ బ్యాంక్స్, కొలరాడో కాంగ్రెస్ సభ్యురాలు లారెన్ బోబర్ట్ ఈ వేడుకకు హాజరైన ప్రముఖులు.
ట్రంప్ మాజీ భార్య ఇవాన ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ … డొనాల్డ్ ట్రంప్ తన జన్మ దిన వేడుకలను ద్వేషిస్తారని చెప్పారు. ఇక మెలానియా ట్రంప్.. తన భర్త నుంచి దూరంగా వెళ్లిపోయి సొంత జీవితాన్ని గడిపేందుకు నిర్దేశించుకున్న షెడ్యూల్ అమలుపై మెలానియాఫోకస్ చేశారని ఆమె సన్నిహిత వర్గాల కథనం.
మెలానియా ట్రంప్ గైర్హాజరు కావడానికి వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వదంతులు షికారు చేశాయి. కానీ రైటర్ క్రిస్టెన్ బర్ట్ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ నుంచి మెలానియా విడిపోతున్నారనడం తప్పన్నారు.
డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ అభిరుచులు, అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. వారు స్వతంత్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. కనుక వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడిందని చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఆమె న్యూయార్క్ సిటీకే పరిమితం అయ్యారు. తన కొడుకు బారెన్ స్కూల్ పూర్తయ్యాక వాషింగ్టన్కు వెళతానని చెప్పారావిడ.