బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 10, 2020 , 03:12:48

ట్రంప్‌తో.. మెలానియా విడాకులు?

ట్రంప్‌తో..  మెలానియా విడాకులు?

వాషింగ్టన్‌, నవంబర్‌ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో ఓడి పదవిని కోల్పోబోతున్న ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా కల్లోలం రేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ నుంచి ఆయన భార్య మెలానియా ట్రంప్‌ విడాకులు కోరుతున్నారనే వార్త సంచలనం సృష్టిస్తున్నది. ఈ విషయాన్ని ట్రంప్‌ మాజీ సహాయకుడు ఒమరోసా మానిగాల్ట్‌ న్యూమన్‌ స్వయంగా వెల్లడించారు. ట్రంప్‌తో మెలానియా జీవితం క్షణమొక యుగంగా గడుస్తున్నదని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్‌ వైట్‌హౌస్‌ను వదిలిన వెంటనే మెలానియా విడాకులు కోరే అవకాశం ఉన్నదని చెప్పారు. భర్తతో 15 ఏండ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేముందు తన కుమారుడు బారన్‌కు ట్రంప్‌ ఆస్తిలో సమాన వాటా దక్కేలా మెలానియా ప్రయత్నిస్తున్నారని వారి మరో మాజీ సహాయకురాలు స్టెఫాని వోకాఫ్‌ వెల్లడించారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి ట్రంప్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా భర్తకే మద్దతిచ్చిన మెలానియా, తాజా ఎన్నికల ప్రచారంలో కనిపించకపోవటం కూడా వారి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం చేకూర్చింది.   

పదవి నుంచి తప్పుకోండి.. ట్రంప్‌పై ఒత్తిళ్లు

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. శాంతియుతంగా అధికార బదిలీ జరిగేందుకు ఎన్నికల విజేత జో బైడెన్‌ బృందానికి సహకరించాలని ఉన్నతస్థాయి అధికార వర్గాలు కోరుతున్నాయి. ప్రజల తీర్పును గౌరవించి శాంతియుతంగా అధికార బదిలీ జరిగేలా ట్రంప్‌ సహకరించాలని బైడెన్‌ బృందంలోని కీలక సభ్యుడు జెన్‌ సకి కోరారు. అధికార బదిలీ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాలని సెంటర్‌ ఫర్‌ ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సిషన్‌ సోమవారం డిమాండ్‌ చేసింది. అయితే, అధికార బదిలీ కార్యక్రమాన్ని రూపొందించే జనరల్‌ సర్వీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాత్రం ఇప్పటికీ దీనిపై స్పందించలేదు.