గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 12, 2020 , 19:24:52

ట్రంప్‌ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు దక్కేదెంత?

ట్రంప్‌ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు దక్కేదెంత?

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్‌, ఉపాధ్యక్షురాలుగా కమలాదేవి హారిస్‌లు ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో పదవిని అధిష్టించేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు, వైట్‌హౌజ్‌ను వీడిన మరు క్షణమే డొనాల్డ్‌ ట్రంప్‌కు విడాకులు ఇవ్వాలని మెలానియా ట్రంప్‌ డిసైడ్‌ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. ట్రంప్‌తో తన 15 ఏండ్ల పెండ్లిబంధానికి ముగింపు పలికేందుకు మెలానియా ఎదురుచూస్తున్నట్లుగా ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ చెప్పారు. డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా మధ్య భార్యాభర్తల బంధమే లేదని, అవసరం కోసం కలిసి బతికేస్తున్నారని ఒమరోసా చెప్పుకొచ్చారంట. ఈ విషయాన్ని డెయిలీ మెయిల్‌ వెల్లడించగా.. ఇప్పుడు ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి మెలానియా సిద్ధపడటంతో.. మెలానియాకు దక్కే పరిహారం విషయంలో న్యాయ నిపుణులు గట్టి అంచనాలే వేస్తున్నారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియాలు 2005 లో వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏండ్ల వయసున్న బారన్‌ ట్రంప్‌ అనే కుమారుడున్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల తర్వాత మెలానియా వైట్‌హౌస్‌కు వచ్చారు. తన కుమారుడు బారన్ చదువు మధ్యలో ఉండటంతోనే న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు రావడానికి ఆలస్యమైనట్టు మెలానియా అప్పట్లో చెప్పారు. కానీ, స్టెఫానీ వోల్కాఫ్ మాత్రం.. ట్రంప్ సంపదలో బారన్‌కు సమాన వాటా ఇవ్వాలని మెలానియా పట్టుబట్టారని, అందుకే ఆమె ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు. రెండో భార్య మార్లా మాపుల్స్‌తోనూ ట్రంప్‌ది ఒప్పంద వివాహమేనని, దాని ప్రకారం ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి విషయాలను బయటపెట్టకూడదు. ఈ నేపథ్యంలో మెలానియాతో రహస్య ఒప్పందం ఉండే ఉంటుందని, అందుకే ఆమె ఈ పరిస్థితుల్లో కూడా బయటకు ఏమీ మాట్లాడడం లేదని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన పలు సంఘటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. ట్రంప్‌ మాజీ భార్యల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందబోతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్‌ సంపద 250 కోట్ల డాలర్లు. మొదటి భార్యకు 14 మిలియన్‌ డాలర్లతోపాటు కనెక్టికట్‌లో ఒక భవనం, న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌ కూడా దక్కాయి. రెండవ భార్యకు 2మిలియన్‌ డాలర్లు భరణం కింద అందగా.. ఇప్పుడు మెలానియాకు మాత్రం వారిద్దరి కంటే ఎక్కువగా భరణం అందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. న్యూమాన్ రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు మెలానియా విడాకులు తీసుకున్నపక్షంలో ఆమెకు ట్రంప్‌ ఆస్తి నుంచి 68 మిలియన్‌ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో రూ.507 కోట్లకుపైగా అందనున్నాయి. వీరి కుమారుడు బారన్‌కు 14 ఏండ్లు కావడంతో మెలానియాకు దక్కే ప్రాథమిక కస్టోడియన్‌ హక్కులన్నీ బారన్‌కు కూడా దక్కుతాయి. దాంతో భారీ మొత్తంలో భరణంతోపాటు కుమారుడి సంక్షేమానికి కూడా ట్రంప్‌ ఆస్తి ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలానియా ట్రంప్ రచయిత మేరీ జోర్డాన్ ప్రకారం.. ట్రంప్ తన మునుపటి వివాహాలకు బారన్ పిల్లలుగా అన్ని ప్రయోజనాలను పొందేలా మెలానియా చర్యలు తీసుకున్నది.

కొసమెరుపు

ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ బాస్ జెఫ్‌ బెజోస్ నుంచి విడాకులు తీసుకున్న అయన భార్య మెకెంజీ.. 38.3 బిలియన్‌ డాలర్స్‌.. భారత కరెన్సీలో రూ.2.62 లక్షల కోట్లు భరణం కింద అందుకున్నారు.ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు ఇవే కావడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.