గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 02:54:50

మానవతకు ‘ప్రతిమ’

మానవతకు ‘ప్రతిమ’

  • రెండేండ్ల చిన్నారికి ఉచితంగా ఖరీదైన వైద్యం
  • రూ.30 లక్షల ఖర్చయ్యే చికిత్స చేసిన ప్రతిమ హాస్పిటల్‌    
  • ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ప్రత్యేకచొరవ
  • విజయవంతంగా కాలేయమార్పిడి చేసిన వైద్య నిపుణులు

అది పదివేలమందిలో ఒక్కరికే వచ్చే వ్యాధి.. దాన్ని నయం చేయాలంటే లక్షలు ఖర్చవుతాయి.. అలాంటి రోగం పేద కుటుంబంలో పుట్టిన ఓ బాలుడికి సోకి కాలేయాన్ని పనిచేయకుండా చేసింది.. నిరంతరం నరకాన్ని చూపించింది.. చేతిలో చిల్లిగవ్వలేని పేద కుటుంబానికి ఆ చిన్నారిని బతికించుకోవటం భారంగా మారింది.. ఆశలు కూడా వదులుకున్నారు.. ఇలాంటి తరుణంలో గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించింది ప్రతిమ హాస్పిటల్‌. రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చయ్యే శస్త్రచికిత్సను ఆ బాలుడికి పూర్తి ఉచితంగా చేసి మానవత్వానికి ‘ప్రతిమ’గా నిలిచింది. నిరుపేద బిడ్డను బతికించేందుకు ఇది తమవంతు సాయమంటూ కాలేయమార్పిడి చేసింది. బాలుడికి పునర్జన్మ ప్రసాదించి బంగారు భవిష్యత్తుకు తోడైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ప్రత్యేకచొరవ తీసుకున్నారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఓ నిరుపేద బాలుడి ప్రాణాలను కాపాడేందుకు ప్రతిమ హాస్పిటల్‌ గొప్ప నిర్ణయం తీసుకొన్నది. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు బాధ్యతగా రూ.30 లక్షలు అయ్యే సర్జరీని నయా పైసా తీసుకోకుండా ఉచితంగా నిర్వహించింది. పై ఖర్చులు కూడా యాజమాన్యమే భరించి మానవత్వాన్ని చాటింది. డాక్టర్‌ అంటే దేవుడని, దవాఖాన అంటే దేవాలయం అని గొప్పగా నిరూపించింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చర్లపల్లికి చెందిన లక్ష్మణ్‌, రజిత దంపతులకు రెండున్నరేండ్ల తేజాన్షు ఏకైక సంతానం. లక్ష్మణ్‌ దుబాయ్‌లో కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తేజాన్షు పుట్టుకతోనే ‘కాంజినెటల్‌ బైలరీ అట్రెసియా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి పదివేల మందిలో ఒకరికి వచ్చే జన్యుపరమైన వ్యాధి. దీనివల్ల కాలేయం పనిచేయక, కామెర్లు వచ్చి, చివరికి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి సోకి తేజాన్షు ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. దీంతో బాధిత కుటుంబం తిరుగని దవాఖాన లేదు. కొన్ని కార్పొరేట్‌ దవాఖానలకు పోతే రూ.30 లక్షల దాకా అవుతాయని చెప్పటంతో తమ బిడ్డను బతికించుకోలేమేమో అని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఆశ్రయించి తమ గోడును వెల్లబోసుకున్నారు. స్పందించిన ఆయ న.. ఆ పేద బిడ్డను ఎలాగైనా బతికించాలని ప్రతిమ హాస్పిటల్‌ వైద్యులకు విజ్ఞప్తిచేశారు. దీంతో ఉచితంగా శస్త్రచికిత్స చేసేందుకు దవాఖాన యాజమాన్యం, అక్కడి సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడు డాక్టర్‌ మధుసూదన్‌, మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడు డాక్టర్‌ రమేశ్‌కుమార్‌తో కూడిన వైద్యబృందం ముందుకొచ్చింది. శస్త్రచికిత్సకే కాకుండా, ఇతర ఖర్చులను కూడా తామే భరిస్తామని చెప్పింది. డాక్టర్‌ మధుసూదన్‌, డాక్టర్‌ రమేశ్‌కుమార్‌, హెపటాలజిస్టు నిపుణులు సహా 20 మందితో కూడిన వైద్యబృందం ఈనెల 6న కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్‌లో 18 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి బాలుడికి కాలేయమార్పిడి చేశారు. బాలుడికి గతంలో ‘కాసాయి’ శస్త్రచికిత్స జరిగినందున కాలేయమార్పిడి చేసే సమయంలో ఇతర దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 15 రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలుడు పూర్తిగా కోలుకున్నాడని, ఇకనుంచి తేజాన్షు ఇతర పిల్లల మాదిరే సాధారణ జీవితాన్ని గడుపుతాడని డాక్టర్లు తెలిపారు. బాలుడిని గురువారం  డిశ్చార్జి చేసినట్టు పేర్కొన్నారు.

మా బిడ్డపై ఆశలు వదులుకున్నాం కానీ..

ఆర్థికస్థోమత లేక మా బిడ్డపై ఆశలు వదులుకున్న తరుణంలో వినోద్‌ సారు, ప్రతిమ దవాఖాన డాక్టర్లు మా బిడ్డకు పునర్జన్మను ప్రసాదించిండ్రు. వారికి, దవాఖాన డాక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటం.

- తేజాన్షు తల్లి రజిత

నిరుపేదల ప్రాణాలు కాపాడటమే లక్ష్యం

రోగులు.. ముఖ్యంగా నిరుపేదల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే ప్రతిమ హాస్పిటల్‌ యాజమాన్యం, వైద్యసిబ్బంది సేవలందిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తేజాన్షును బతికించాలనే సదుద్దేశంతో ప్రతిమ హాస్పిటల్‌ వైద్యులతోపాటు యాజమాన్యం ముందుకు వచ్చింది. పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించింది. అంతేకాదు.. శస్త్రచికిత్సకు అయ్యే ఇతర ఖర్చులను కూడా దవాఖాన యాజమాన్యమే భరించింది. నిరుపేద బిడ్డను బతికించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇది మా హాస్పిటల్‌ వైద్యుల గొప్ప విజయం.

- డాక్టర్‌ ప్రతీక్‌ బోయినపల్లి, డైరెక్టర్‌, ప్రతిమ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌

కాంజినెటల్‌ బైలరీ అట్రెసియా అంటే..

సాధారణంగా ప్రతి మనిషిలోని కాలేయంలో బైయిల్‌ యాసిడ్‌(పైత్య రసం) తయారవుతుంది. ఈ విధంగా తయారైన పైత్యరసం పేగుల్లోకి పోవటానికి ప్రత్యేకమైన గొట్టాలుంటాయి. కానీ, కొంతమందిలో ఈ లివర్‌పైప్స్‌ అంటే పైత్యరసం వెళ్లే గొట్టాలు జన్యులోపం వల్ల ఏర్పడవు. దీనివల్ల పైత్యరసం కాలేయంలోనే ఉండిపోయి పెద్దగా వాచిపోతుంది. ఫలితంగా కాలేయం దెబ్బతినటంతో కామెర్లు ఏర్పడి కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ వ్యాధినే ‘కాంజినెటల్‌ బైలరీ అట్రెసియా’ అంటారు. ఇది 10వేల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని సకాలంలో గుర్తించి కాలేయ మార్పిడి చేయకపోతే రోగి మృతిచెందే ప్రమాదముంది. - డాక్టర్‌ మధుసూదన్‌ , సర్జికల్‌ గ్యాస్ట్రో, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ నిపుణుడు