బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 08:29:03

హాంకాంగ్‌లో మీడియా దిగ్గజం అరెస్ట్‌.!

హాంకాంగ్‌లో మీడియా దిగ్గజం అరెస్ట్‌.!

హంకాంగ్‌: హాంకాంగ్‌ అధికారులు కొత్త జాతీయ భద్రతా చట్టం అమలు తీరును విస్తృతం చేశారు. మీడియా టైకూన్‌, నెక్ట్స్‌ డిజిటల్‌ గ్రూప్‌ అధినేత జిమ్మీ లై (71)ను సోమవారం అరెస్ట్‌ చేశారు. ఆయన ప్రధాన కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీసులు సాక్ష్యాధారాల పేరిట కొన్ని బాక్సులను పట్టుకెళ్లారు. జిమ్మీ లైతోపాటు ఆయన కొడుకును, సంస్థలోని పలువురు ఉద్యోగులను కూడా అరెస్ట్‌ చేశారు. మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పోలీసులు చర్య తీసుకోవడం హాంకాంగ్‌లో ఇది మొదటిసారి. గతేడాది హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు వెల్లువెత్తిన నేపథ్యంలో చైనా నూతన జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకువచ్చింది.

నెక్ట్స్‌ డిజిటల్‌ మీడియా సంస్థ ‘ఆపిల్‌ డైలీ’ పేరుతో ప్రజాస్వామ్య అనుకూల టాబ్లాయిడ్‌ పత్రికను నడుపుతున్నది. తరుచుగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనాల్సిందిగా పదేపదే ప్రజలకు పిలుపునిచ్చింది. కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని జిమ్మీ లై వ్యతిరేకించారు. లై విదేశాలతో కుమ్మక్కయ్యారని అభియోగాలు నమోదు చేశారని నెక్ట్స్‌ డిజిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ సిమన్‌ ఆరోపించారు. నూతన జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న అనుమానంపై తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశామని హంకాంగ్‌ పోలీసులు తెలిపారు. 


logo