మంగళవారం 26 మే 2020
International - Apr 08, 2020 , 10:27:28

న్యూజెర్సీలో కరోనా.. ప్యాటర్సన్‌ మేయర్‌కు పాజిటివ్‌

న్యూజెర్సీలో కరోనా.. ప్యాటర్సన్‌ మేయర్‌కు పాజిటివ్‌

హైదరాబాద్‌ : అగ్ర రాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ వణికిస్తోంది. అక్కడ కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. న్యూయార్క్‌ సిటీలో అయితే శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1736 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం న్యూయార్క్‌ సిటీలోనే మంగళవారం 731 మంది మరణించారు. తాజాగా న్యూజెర్సీలోని ప్యాటర్సన్‌ మేయర్‌ ఆండ్య్రూ సయేఘ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. మేయర్‌ ఆండ్య్రూకు కరోనా లక్షణాలు లేవు. కానీ అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మేయర్‌ హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. 

కరోనా వైరస్‌ తనకు ఎలా సోకిందో అర్థం కావడం లేదు అని మేయర్‌ పేర్కొన్నారు. తనకెలాంటి జ్వరం, దగ్గు లేదు. అయినప్పటికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతానికి తాను హోం క్వారంటైన్‌లోనే ఉన్నానని మేయర్‌ తెలిపారు. ఇక మేయర్‌ భార్య, పిల్లల రక్త నమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. 

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్యాటర్సన్‌ ప్రజలెవరూ బయటకు రావొద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని మేయర్‌ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మాస్కు ధరించాలని మేయర్‌ ఆండ్య్రూ సూచించారు. తాను కరోనాపై యుద్ధం చేస్తున్నానని, తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తానని మేయర్‌ చెప్పారు.


logo