ఆదివారం 06 డిసెంబర్ 2020
International - Nov 13, 2020 , 12:23:24

జైలు గ‌ది.. బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు అమ‌ర్చారు: మ‌రియం న‌వాజ్ షరీఫ్‌

జైలు గ‌ది.. బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు అమ‌ర్చారు: మ‌రియం న‌వాజ్ షరీఫ్‌

హైద‌రాబాద్‌: తాను ఉన్న జైలు గ‌ది.. బాత్రూమ్‌లో అధికారులు సీసీ కెమెరాల‌ను అమ‌ర్చిన‌ట్లు పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కుమార్తె మ‌రియం న‌వాజ్ ఆరోపించారు. చౌద‌రీ షుగ‌ర్ మిల్స్ మ‌నీల్యాండ‌రింగ్‌ కేసులో గ‌త ఏడాది అరెస్టు అయిన త‌ర్వాత ఎదుర్కొన్న క‌ష్టాల గురించి ఆమె జియో న్యూస్‌తో పేర్కొన్నారు.  జైలుకు రెండు సార్లు వెళ్లాన‌ని, ఒక మ‌హిళ‌గా తాను ఎలాంటి జైలు జీవితాన్ని గ‌డిపానో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని, ఆ అధికారులు త‌న ముందు త‌ల ఎత్తుకోలేర‌ని ఆమె ఆరోపించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ న‌వాజ్ పార్టీ ఉపాధ్య‌క్షురాలైన మ‌రియం న‌వాజ్ మాట్లాడుతూ.. త‌న తండ్రి నవాజ్ ష‌రీఫ్ ముందే త‌న‌ను అరెస్టు చేశార‌ని, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌ని, అలాంటి స‌మ‌యంలో పాకిస్థాన్‌లో ఉన్న ఏ ఒక్క మ‌హిళ కూడా సుర‌క్షితంగా లేన‌ట్లే అని ఆమె అన్నారు. పాక్‌లో ఉన్నా.. ఇత‌ర దేశాల్లో ఎక్క‌డైనా.. మ‌హిళ బ‌ల‌హీన‌రాలు కాదు అని ఆమె తెలిపారు.  పీటీఐ ప్ర‌భుత్వాన్ని అధికారం నుంచి తొల‌గించేందుకు రాజ్యాంగ బ‌ద్దంగా సైనిక అధికారుల‌తో చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మ‌రియం న‌వాజ్ తెలిపారు.