శనివారం 28 మార్చి 2020
International - Mar 24, 2020 , 02:33:14

‘డ్రాగన్‌' పాఠాలు!

‘డ్రాగన్‌' పాఠాలు!

  • కరోనాకు చైనా ముకుతాడు
  • మహమ్మారిపై అసాధారణ పోరాటం 
  • నగరాలు దిగ్బంధం
  • అతిక్రమణలపై ఉక్కుపాదం
  • విరివిగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం

కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాడుతున్నది. దేశాలకు దేశాలు లాక్‌డౌన్‌ అవుతున్నాయి. అయితే ఈ మహమ్మారికి పుట్టినిల్లయిన చైనా.. అసాధారణ రీతిలో దానిని కట్టడి చేయగలిగింది.  నగరాలను దిగ్బంధించి.. సామాజిక దూరాన్ని పటిష్టంగా అమలుపరిచి.. ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి..  వైరస్‌పై పైచేయి సాధించింది. 

కరోనాను కట్టడి చేయడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా విస్తృతంగా వినియోగించింది. కోట్లాది మందిని రోజూ ట్రాక్‌ చేసేందుకు అలీబాబా, టెన్సెంట్‌ వంటి దిగ్గజ కంపెనీలతో కలిసి ‘కలర్‌ కోడెడ్‌ హెల్త్‌ రేటింగ్‌ సిస్టమ్‌'ను ప్రవేశపెట్టింది. ట్రావెల్‌, మెడికల్‌ హిస్టరీని బట్టి ప్రజలకు మూడు రకాల కలర్‌ కోడ్‌లను (గ్రీన్‌, ఎల్లో, రెడ్‌) కేటాయిస్తారు. ఈ కలర్‌ కోడ్‌ను బట్టే ఆ వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచాలా, బయటకు అనుమతించవచ్చా అన్నది నిర్ధారిస్తారు. బహిరంగ ప్రాంతాల్లో చెక్‌ పాయింట్లు ఏర్పాటుచేసి కలర్‌కోడ్‌లను, శరీర ఉష్ణోగ్రతను చెక్‌ చేస్తారు.  దవాఖానల్లో వంటచేయడం దగ్గర నుంచి, క్రిమిసంహారక ద్రావణాల పిచికారీ, శానిటైజర్లు పంపిణీ, భోజనం సరఫరా వరకు రోబోలను విరివిరిగా వినియోగించారు. మరోవైపు, నమూనాల సేకరణ, మెడికల్‌ కిట్ల చేరవేతకు డ్రోన్లను విస్తృతంగా వాడారు. 

వైరస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు బిగ్‌డేటాను వినియోగించి డాష్‌బోర్డును రూపొందించారు. ఫేస్‌ రికగ్నిషన్‌, ఇన్‌ఫ్రారెడ్‌ టెంపరేచర్‌ డిటెక్షన్‌ వ్యవస్థలను నగరాల్లో అంతటా ఏర్పాటుచేశారు. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ల ద్వారా ప్రజల కదలికలపై నిఘా ఉంచారు. కృత్రిమ మేథను కూడా బాగా వినియోగించుకున్నారు. శరీర ఉష్ణోగ్రతలో వచ్చే మార్పును గుర్తించేందుకు బైదు అనే కంపెనీ ఏఐ ఆధారిత ఇన్‌ఫ్రారెడ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ప్రయాణికుల కదలికలకు అంతరాయం కలుగకుండా ఇది నిమిషంలో 200 మంది ని ఎగ్జామిన్‌ చేయగలదు. ఈ విధంగా కరోనాను చైనా కట్టడి చేయగలిగింది. 

దక్షిణ కొరియా, తైవాన్‌ కూడా..

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దక్షిణ కొరియా, తైవాన్‌ కూడా కరోనాకు అడ్డుకట్ట వేశాయి. బిగ్‌డేటా, కృత్రిమ మేధ, ప్రత్యేక యాప్‌ల ద్వారా ప్రజల కదలికలను గుర్తించి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకున్నాయి. 

విస్తృత అవగాహన

ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే వైరస్‌ వేగంగా వ్యాప్తి అవుతున్నదని గుర్తించిన ప్రభుత్వం..అధికారిక మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన చర్యలు చేపట్టింది. ‘వైరస్‌పై ఏ స్థాయిలో అవగాహన చర్యలు చేపట్టామంటే.. బయట మహమ్మారి ఉంది.. మనం బయటకు వెళ్లకూడదని నా మూడేండ్ల కుమార్తెకు కూడా తెలుసు’ అని చైనా ఇన్ఫర్మేషన్‌ డైరెక్టర్‌ లీ జియావ్‌జున్‌ తెలిపారు. 


రెండు వారాల్లో రెండు దవాఖానల నిర్మాణం

వైరస్‌ బాధితులకు చికిత్స అందించేందుకు చైనా వాయువేగంతో కదిలింది. కేవలం రెండు వారాల్లో రెండు భారీ దవాఖానలను నిర్మించింది. బాధితులకు చికిత్స అందించేందుకు టిబెట్‌ వంటి స్వయం ప్రతిపత్తి ప్రాంతాలను మొదలకుని 30 ప్రావిన్సుల నుంచి హుబెయి ప్రావిన్సుకు వైద్య సిబ్బందిని తరలించింది. అలాగే 4,000 మంది ఆర్మీమెడికల్‌ స్టాఫ్‌ను కూడా మోహరించింది. ఇప్పుడు చైనా రోజుకు 30 లక్షల టెస్ట్‌ కిట్‌లను, 1.2 కోట్ల మాస్క్‌లను తయారు చేస్తున్నది. 

5 కోట్ల మంది నిర్బంధం


వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా నగరాలకు నగరాలను దిగ్బంధించింది. రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ప్రజలను ఇండ్లకే పరిమితం చేసింది. అత్రిమించినవారిపై ఉక్కుపాదం మోపింది. విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు, థియేటర్లు, క్రీడా ఈవెంట్లను రద్దుచేసింది. సామాజిక దూరం పాటించడాన్ని కఠినంగా అమలుచేసింది. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. జనవరి 23 నుంచి ఇప్పటివరకు చైనా దాదాపు 5 కోట్ల మందిని నిర్బంధ క్వారంటైన్‌లో ఉంచింది. క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చిన వారి వివరాలు చెప్పిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చింది. మాస్క్‌లను అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నది. ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలు విధించింది. చర్చలు, మసీదులు, ఆలయాలకు వెళ్లడంపై నిషేధం విధించింది.ఫలితంగా కేసులు దిగివచ్చాయి. 


logo