గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 19, 2020 , 02:45:05

నిర్లక్ష్యపు శాపమిది

నిర్లక్ష్యపు శాపమిది

ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక విధి. కానీ.. కరోనా వైరస్‌ విషయంలో అనేక దేశాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. చైనాలో వైరస్‌ విజృంభించి కరాళ నృత్యం చేస్తున్నా.. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి. ‘మన దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాంలే!’ అన్న వైఖరే ఇప్పుడు కొంపముంచుతున్నది. వైరస్‌ చొచ్చుకొచ్చి ప్రజల ప్రాణాలను హరించడం మొదలుపెట్టాక అధికార యంత్రాంగంలో కదలిక వచ్చినా.. ‘ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్న’ చందంగా తయారైంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మరణ మృదంగం ఆగడం లేదు. చైనా తర్వాత వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఇటలీ, ఇరాన్‌, అమెరికా వంటి దేశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.       

-  నేషనల్‌ డెస్క్‌

ప్రభుత్వం, ప్రజల సమిష్టి వైఫల్యం 

పరిస్థితి: ఇటలీలో జనవరి 31న మొదటి కరోనా కేసు వెలుగుచూసింది. ఫిబ్రవరి 20 నాటికి నలుగురు బాధితులుండగా.. 21వ తేదీన ఐదురెట్లు (21కేసులు) పెరిగింది. ఆ తర్వాత వారంలోనే వెయ్యి దాటింది. ఫిబ్రవరి 20 నాటికి ఒక్కరూ మృతి చెందలేదు. కానీ 29నాటికి 21 మంది మరణించారు. ఇప్పుడు రోజుకు వందల సంఖ్యల్లో మృత్యువాత పడుతున్నారు. 

కారణాలు:  ప్రభుత్వంతోపాటు ప్రజల నిర్లక్ష్య ఫలితమే ఈ దుస్థితి. మొదటికేసు నమోదైన తర్వాత 22 రోజులకుగానీ ప్రభుత్వం మేల్కొనలేదు. ఫిబ్రవరి 22న ప్రజల కదలికలపై ఆంక్షలు విధించింది. వాటిని కఠినంగా అమలుచేయలేదు. వైద్య ఏర్పాట్లు చేయడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రజలు సైతం ప్రభుత్వ ఆంక్షలను పాటించలేదు. రెడ్‌జోన్లుగా ప్రకటించినా బయట తిరుగడం ఆపలేదు. దీంతో వైరస్‌ వేగంగా వ్యాపించింది. కేవలం ఐదు రోజుల్లోనే స్టేజ్‌-3 నుంచి స్టేజ్‌-6కు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

40 రోజుల తర్వాత మేల్కొన్న ఫ్రాన్స్‌

పరిస్థితి: ఫ్రాన్స్‌లో జనవరి 24న ఒకేరోజు మూగ్గురికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గురువారం నాటికి ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య 7,730 దాటింది. కేవలం 20 రోజుల్లోనే 7,700 మందికి వ్యాధి సోకింది.

కారణాలు: జనవరి 24న తొలికేసు వెలుగుచూసినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఫిబ్రవరి 26నాటికి 18 కేసులు నమోదుకాగా.. 27న ఏకంగా 38కి పెరిగింది. అక్కడి నుంచి రోజూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నది. దీంతో ప్రభుత్వం మార్చి 2వ తేదీన ప్రజల కదలికలపై ఆంక్షలు విధించింది. అంటే.. మొదటి కేసు నమోదైన 40 రోజుల తర్వాత ప్రభుత్వం మేల్కొన్నది. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. 


శాపంగా మారిన చిన్న తప్పు 

పరిస్థితి: దక్షిణ కొరియాలో తొలి కేసు జనవరి 20న నమో దైనా ప్రభుత్వం పట్టించుకోలే దు. మార్చి 18నాటికి కేసులు 8,500కు, మరణాలు 93కు పెరిగాయి.  

కారణాలు: ఫిబ్రవరి 18న ‘షించియోంజి’ నగరానికి చెందిన మహిళకు కరోనా సోకినట్టు తేలింది. ఆమె టియాగూలోని ప్రఖ్యాత చర్చిలో బహిరంగ సభకు హాజరైం దని, అక్కడి నుంచి మరో నాలుగు చర్చిలకు తిరిగిందని తేలింది. అప్పటి నుంచి బాధితుల సంఖ్య ప్రతిరోజు రెట్టింపయ్యిం ది. డియాగూ, షించియోంజి నగరాల్లో ఫిబ్రవరి 22 నాటికి చర్చిలకు హాజరైన 9,500 మందిని పరీక్షించగా.. 1261 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. 

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. ఇరాన్‌ 

పరిస్థితి: ఇరాన్‌లో ఫిబ్రవరి 19న మొదటి కేసు వెలుగుచూసింది. ప్రస్తుతం 17,300కుపైగా బాధితులుండగా, మృతుల సంఖ్య 11వందలు దాటింది.

కారణాలు: మొదటి కేసు వెలుగు చూసేనాటికి ప్రపంచవ్యా ప్తంగా 75వేల కేసులు, రెండువేల మృతులు నమోదయ్యా యి. అయినా ఇరాన్‌ ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమ లుచేయలేదు. ప్రజలు, మతపెద్దలు సైతం సహకరించలేదు. ప్రార్థనా స్థలాలకు భక్తుల రాకను నియంత్రించాలని ఫిబ్రవ రి 20న ప్రభుత్వం కోరగా.. మత పెద్దలు అంగీకరించలేదు. పైగా శుక్రవారం భారీ ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. ఫలితంగా  వైరస్‌ పడగవిప్పింది. ఫిబ్రవరి 26 నుంచి బాధితులు, మృతుల సంఖ్య రెట్టింపు కావడం మొదలైంది. 

ఓడిపోయిన పెద్దన్న.. 

పరిస్థితి: అమెరికాలో జనవరి 20న మొదటి కేసు వెలుగు చూసింది. ప్రస్తుతం 7,538 కేసులున్నాయి. 117మంది మరణించారు.

కారణాలు:  కరోనా పెనుముప్పుగా మారుతుందని అమెరికా ఊహించ లేదు. వైద్యఏర్పాట్లు, బడ్జెట్‌ కేటాయింపులు వంటి చర్యలు తీసుకోలేదు. పైగా తీవ్రతను తగ్గించి చూపిం ది. ఫలితంగా గత 15 రోజుల్లోనే వందమందికి పైగా బలయ్యారు. 

మీకు తెలుసా? 

కరోనా వైరస్‌ 

గాలిలో.. 3 గంటల వరకు, 

రాగి పాత్రలపై.. 4 గంటల వరకు 

అట్టపెట్టెలపై.. 24 గంటల వరకు 

ప్లాస్టిక్‌, స్టీల్‌ సామగ్రిపై.. 

2-3 రోజులు జీవిస్తుందట. 


logo