బుధవారం 27 జనవరి 2021
International - Jan 11, 2021 , 01:18:48

అలా నడుస్తూ.. ఇలా కాలుస్తూ!

అలా నడుస్తూ.. ఇలా కాలుస్తూ!

  • షికాగోలో ఓ ఉన్మాది దారుణం
  • పబ్‌జీ గేమ్‌లాగా తుపాకీతో విహారం
  • కన్పించిన వారినల్లా కాల్చిన వైనం
  • ముగ్గురి మృతి.. నలుగురికి గాయాలు 
  • పోలీసుల కాల్పుల్లో ఉన్మాది హతం

షికాగో, జనవరి 10: అమెరికాలోని షికాగోలో ఓ ఉన్మాది.. అలా సరదాగా నడుచుకొంటూ వెళ్తూ ముగ్గురిని తుపాకీతో కాల్చిచంపేశాడు. మరో నలుగురిని గాయపర్చాడు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ సైకో పేరు జేసన్‌ నైటింగేల్‌(32). జేసన్‌ తుపాకీ చేతబట్టి నాలుగు గంటల పాటు కనిపించినవారినల్లా కాల్చుతూ షికాగోలో స్వైర విహారం చేశాడు. చివరికి పోలీసులు అతన్ని కాల్చి చంపేసి  మృత్యక్రీడను అడ్డుకొన్నారు. జేసన్‌ శనివారం సాయంత్రం తుపాకీ పట్టుకొని బయటకు వచ్చాడు. మొదట షికాగో వర్సిటీ విద్యార్థి(30ని కాల్చి చంపేశాడు. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు. అక్కడ సెక్యూరిటీ గార్డు, వృద్ధురాలిని కాల్చాడు. గార్డు చనిపోగా, వృద్ధురాలు మృత్యువుతో పోరాడుతున్నది. తర్వాత జేసన్‌ అక్కడి నుంచి మరో భవనం దగ్గరికి వెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి కారు లాక్కున్నాడు. కారులో ఓ దుకాణం దగ్గరికి వెళ్లి కాల్పులు జరిపాడు. అక్కడ ఓ యువకుడు చనిపోయాడు. మరో వృద్ధురాలు గాయపడింది. తర్వాత దుకాణం నుంచి బయటకు వచ్చి కొంత దూరం వెళ్లాడు. అక్కడ తల్లితో కలిసి కారులో వెళ్తున్న 15 ఏండ్ల బాలికను కాల్చాడు. తర్వాత మళ్లీ దుకాణం దగ్గరికి వచ్చాడు. అక్కడ అప్పటికే అధికారులు చేరుకొని కాల్పుల గురించి ఆరా తీస్తున్నారు. వారిపై జేసన్‌ తుపాకీతో విరుచుకుపడ్డాడు. అక్కడి నుంచి 16 కిలోమీటర్లు కారులో వెళ్లి షికాగో సరిహద్దులో ఓ ఫార్మసీలో దొంగతనానికి ప్రయత్నించాడు. తర్వాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లి మహిళను కాల్చాడు. అక్కడ పార్కింగ్‌ వద్ద పోలీస్‌ అధికారులతో గొడవపెట్టుకొన్నాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో జేసన్‌ చనిపోయాడు. అయితే జేసన్‌ కాల్పులకు కారణమేమిటన్న విషయం ఇంకా తెలియలేదని అధికారులు చెప్పారు. 


logo