హరారే: 16 మంది భార్యలు, 151 మంది పిల్లలున్న వృద్ధుడు మరో పెండ్లికి సిద్దమవుతున్నాడు. వంద మంది భార్యలు, వెయ్యి మంది సంతానాన్ని పొందడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. తన ప్రాణాలు పోయే వరకు ఈ ప్రయత్నంలోనే ఉంటానంటున్నాడు జింబాబ్వేకు చెందిన 66 ఏండ్ల మిషెక్ న్యాన్డోరో. మాజీ సైనికుడైన ఆయన బహు భార్యలున్న వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 1983 నుంచి ఇప్పటి వరకు 16 మంది మహిళలను వివాహం చేసుకుని 151 మంది పిల్లలను కన్నాడు.
తాను ఏ పనీ చేయనని తన భార్యలను సుఖపెట్టడమే తన పని అని జింబాబ్వే పత్రిక హెరాల్డ్‌కు మిషెక్ ఇటీవల తెలిపాడు. 17వ వధువును శీతాకాలంలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. చనిపోయేలోగా 100 మంది భార్యలు, 1 000 మంది పిల్లలను కలిగి ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. 1983లో ప్రారంభించిన బహు భార్యత్వం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని వెల్లడించాడు.
తన భార్యలను సుఖపెట్టేందుకు కఠిన నియమాలు పాటిస్తానని మిషేక్ తెలిపాడు. మరింత మంది పిల్లలను కనేందుకు షెడ్యూల్ ప్రకారం ఒక రాత్రికి నలుగురు భార్యలతో కలిసి గడుపుతానని చెప్పాడు. ఒకరిని సుఖపెట్టిన తర్వాత మరొకరి గదికి వెళ్తానని వివరించాడు. భార్యల వయసు మేరకు పడక గదిలో వారితో వ్యవహరిస్తానని వెల్లడించాడు.
భార్యలంతా ప్రతి రోజు వండి తనకు పంపుతారని, రుచికరంగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుని మిగతా వాటిని తిరిగి వారికి పంపుతానని బహు భార్యల భర్త తెలిపాడు. ఈ నియమాల గురించి తన భార్యలకు ముందే చెప్పానని, అందుకే వారు కోపగించుకోక ఆహారాన్ని మరింతగా రుచిగా వండేందుకు పోటీ పడతారని వెల్లడించాడు.
తన భార్యలంతా సుఖంగాను, సంతోషంగాను ఉన్నారని, ప్రస్తుతం ఇద్దరు భార్యలు గర్భంతో ఉన్నట్లు మిషెక్ తెలిపాడు. ఇంత మందిని పోషించేందుకు తనకు ఎలాంటి ఆర్థిక భారం లేదని, ఇంత పెద్ద కుటుంబం వల్ల చాలా లబ్ధిపొందుతున్నట్లు చెప్పాడు. తన పిల్లలు తనకు బహుమతులు, డబ్బులు ఇస్తుంటారని వెల్లడించాడు.