హూస్టన్: అతడో తాగుబోతు. తరచూ మందు తాగుతూ, గొడవ పడుతూ.. అరెస్టవుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఓ బార్‌పై వేసిన దావా కేసులో గెలిచాడు. ఏకంగా 55 లక్షల డాలర్లు (సుమారు రూ.40 కోట్లు) పరిహారంగా అందుకున్నాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. డేనియల్ రాల్స్ అనే వ్యక్తి లా ఫొగాటా మెక్సికన్ గ్రిల్స్ అనే బార్‌కు వెళ్లాడు. అక్కడ తాగి గొడవపడటంతో అతడు గాయపడ్డాడు. అయితే తాను ఇంతలా తాగడానికి కారణం తాను కాదని, బార్ వాళ్లేనని.. అది కాస్తా గొడవకు దారి తీసిందంటూ డేనియల్ ఓ దావా వేశాడు.
గొడవలో ఉన్న వ్యక్తులకు సదరు లా ఫోగటా మెక్సికన్ గ్రిల్ బార్ మందు సర్వ్ చేస్తూనే ఉన్నదని, ఆ తర్వాత కూడా మైకంలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను అలా వదిలేశారని దావాలో ఉంది. దీనిపై రెండేళ్లపాటు కోర్టులో వాదించిన డేనియల్ మొత్తానికి గెలిచాడు. అంతేకాదు 55 లక్షల పరిహారం కూడా అతనికి దక్కింది. 2019 మేలో ఈ ఘటన జరిగింది. తనకు తగిలిన గాయాలకు బార్ ఓనర్ లౌర్డెస్ గాలిండోతోపాటు మరో బార్ టెండర్ కారణమని డేనియల్ ఆరోపించాడు. తాను గాయపడిన తర్వాత కూడా బార్ ఓనర్ అంబులెన్స్ పిలవలేదని చెప్పాడు.
కానీ ఇలాంటి కేసును డేనియల్ అంత సులువుగా ఎలా గెలిచాడన్న సందేహం చాలా మందిలో కలిగింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు బార్ ఓనర్ అసలు కోర్టు నోటీసులకు స్పందించలేదు. ఒక్క విచారణ కూడా హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో డేనియల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.