శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 19:23:38

యెల్లోస్టోన్ నేష‌న‌ల్ పార్క్‌కు వెళ్ల‌కుండా ఓ వ్య‌క్తిపై రెండేండ్ల నిషేధం.. ఎందుకో తెలుసా..?

యెల్లోస్టోన్ నేష‌న‌ల్ పార్క్‌కు వెళ్ల‌కుండా ఓ వ్య‌క్తిపై రెండేండ్ల నిషేధం.. ఎందుకో తెలుసా..?

న్యూఢిల్లీ: అమెరికాలోని యెల్లోస్టోన్ నేష‌న‌ల్ పార్కులో ఒక వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఆ పార్క్‌లోని వేడి నీటి బుగ్గల దగ్గర చికెన్ వండి చిక్కుల్లో ప‌డ్డాడు. అత‌డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పార్క్ రేంజ‌ర్‌లు ఆ పార్కులోకి రాకుండా రెండేండ్ల‌పాటు నిషేధం విధించారు. అంతేకాదు రూ.44,377.92 (600 డాల‌ర్లు) జ‌రిమానా క‌ట్టించారు. అక్క‌డి వార్తాసంస్థ‌ల ప్ర‌కారం ఇడాహోకు చెందిన ఓ వ్యక్తి 10 మంది హైకర్ల బృందంతో క‌లిసి షోషోన్ గీజర్ బేసిన్‌ సందర్శ‌న‌కు వెళ్లారు. 

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యెల్లోస్టోన్ నేష‌న‌ల్ పార్కులోకి వెళ్లిన‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి ఆ పార్కులోని స‌‌హ‌జ‌సిద్ధ‌మైన వేడినీటి బుగ్గ‌ల‌తో చికెన్ వండ‌టం ప్రారంభించాడు. అయితే పార్కులోని కొంతమంది రేంజర్లు స్థానికుల నుంచి ఈ స‌మాచారం అందుకుని అక్కడికి వెళ్లారు. అప్ప‌టికే రెండు కోళ్లు మొత్తం వేడి నీటి బుగ్గలలో ముంచి ఉన్నాయి. ఆ ప‌క్క‌నే వంట కుండ క‌నిపించింది. దీంతో స‌ద‌రు వ్య‌క్తిని రేంజ‌ర్లు ప‌ట్టుకున్నారు. 

నిందితుడు నిషేధిత ప్రాంతంలోకి ప్ర‌వేశించ‌డ‌మే కాకుండా, పార్కు ప్రాథమిక నియమాలను కూడా ఉల్లంఘించినట్లు తేల్చారు.  అతను నేరాన్ని అంగీకరించడంతో జ‌రిమానాతోపాటు రెండేండ్ల‌పాటు ఆ పార్కులోకి రాకుండా నిషేధం విధించారు. యెల్లోస్టోన్ పార్కు నియ‌మాల ప్ర‌కారం సంద‌ర్శ‌కులుగానీ, ఇత‌రులుగానీ ప్ర‌మాద‌క‌ర‌మైన వేడి నీటి బుగ్గల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కూడ‌దు. ఇడాహో వ్య‌క్తి ఆ నిబంధ‌న‌ను ఉల్లంఘించ‌డ‌మే కాకుండా ఏకంగా చికెన్ వండుకుని చిక్కుల్లో ప‌డ్డాడు. 

కాగా, యెల్లోస్టోన్ పార్కులో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. 2001లో సీటెల్‌కు చెందిన ఒక ప్రముఖ టీవీ యాంక‌ర్‌ తన టీవీ షో కోసం వేడి నీటి బుగ్గల దగ్గర రంధ్రం తవ్వి కోడిని వండుకున్నాడు. సహజమైన వేడిని వంట ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించవచ్చో ప్రేక్ష‌కుల‌కు చూపించాలనుకున్నాడు. కానీ ఆ వ్యక్తికి పార్కు అధికారులు 150 డాలర్లు (రూ.11,096.25) జరిమానా విధించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.