వాషింగ్టన్ : కరోనా వ్యాక్సిన్లు పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి దుష్ర్పభావమూ చూపవని అమెరికాలోని మియామీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. టీకాలు వేసుకోకముందు, వేసుకొన్న తర్వాత రెండు సందర్భాల్లోనూ వీర్యం నాణ్యత, శుక్రకణాల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించలేదని, శుక్రకణాలు తగ్గలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 45 మందికి మొదట పరీక్షలు నిర్వహించగా.. వారిలో 21 మంది ఫైజర్, 24 మందికి మోడెర్నా టీకా వేశారు. ఫైజర్ వేసుకొన్న బృందంలో వ్యాక్సిన్ వేసుకోకముందు వారిలో సగటున మిల్లీలీటర్ వీర్యంలో 2.6 కోట్ల శుక్రకణాలుండగా, టీకా వేసుకొన్న తర్వాత అవి 3 కోట్లకు పెరిగాయి. మోడెర్నా వేసుకొన్నవారిలో 3.6 కోట్ల నుంచి 4.4 కోట్లకు పెరిగాయి.