శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 18:29:22

ఆగస్టు 9న శ్రీలంక ప్రధానిగా రాజపక్స ప్రమాణం

ఆగస్టు 9న శ్రీలంక ప్రధానిగా రాజపక్స ప్రమాణం

కొలంబో : పార్లమెంట్‌ ఎన్నికల్లో జయభేరి మోగించిన శ్రీలంక పీపుల్స్‌ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ).. నాలుగోసారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ఆగస్టు 9న(ఆదివారం) నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొలంబోలోని చారిత్రాత్మక బుద్ధ ఆలయం వేదిక కానుంది. కేబినెట్‌ మంత్రులతా 10వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం.. ప్రస్తుతమున్న 30 కేబినెట్‌ స్థానాలను 26కు కుదించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. 

శ్రీలంక ఎన్నికల చరిత్రలో మహింద రాజపక్స అరుదైన రికార్డు సాధించారు. 5 లక్షల వ్యక్తిగత ప్రాధాన్యత ఓట్లను రాజపక్స సాధించి చరిత్రలో నిలిచిపోయారు. మొత్తం 225 స్థానాలున్న శ్రీలంక పార్లమెంట్‌లో.. 145 స్థానాల్లో ఎస్‌ఎల్‌పీపీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలుపుకుంటే ఆ సంఖ్య మొత్తం 150 స్థానాలకు చేరింది. ఎస్‌ఎల్‌పీపీకి 6.8 మిలియన్ల ఓట్లు(59.9 శాతం) పోలయ్యాయి. 

మాజీ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే సారథ్యంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ పార్టీ కేవలం ఒకేఒక సీటును గెలుచుకున్నది. రణిల్‌ విక్రమ్‌సింఘే 1977 తర్వాత తొలిసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. యూఎన్‌పీ నుంచి వేరుపడి సొంతపార్టీ పెట్టుకున్న సాజిత్‌ ప్రేమదాస్‌ 55 స్థానాలను కైవసం చేసుకుని రెండోస్థానంలో నిలిచారు.


logo