శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 16, 2020 , 11:23:17

420 కోట్ల డాల‌ర్లు దానం ఇచ్చిన బెజోస్ మాజీ భార్య‌

420 కోట్ల డాల‌ర్లు దానం ఇచ్చిన బెజోస్ మాజీ భార్య‌

హైద‌రాబాద్‌:  అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ త‌న దాతృత్వంతో అంద‌ర్నీ స్ట‌న్ చేస్తున్నారు.  అప‌ర కోటీశ్వ‌రాలు అయిన ఆమె త‌న సంప‌ద‌ను విరాళ‌లు రూపంలో ఇచ్చేస్తున్నారు.  గ‌డిచిన నాలుగు నెల‌ల్లో మెకంజీ త‌న ఆస్తిలోని సుమారు 420 కోట్ల డాల‌ర్ల‌ను ప‌లు ఛారిటీ సంస్థ‌ల‌కు విడుద‌ల చేశారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక గ‌మ‌నం మంద‌గించిన విష‌యం తెలిసిందే.  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని అదుకునే ఉద్దేశంతో మెకంజీ స్కాట్ త‌న సంప‌ద‌ను దానం చేస్తున్నారు. నిజానికి క‌రోనా వైర‌స్ వేళ  చాలా వ‌ర‌కు బిలియ‌నీర్ల ఆస్తులు రెట్టింపు అయ్యాయి. స్కామ్ సంప‌ద కూడా అమాంతంగా పెరిగింది. ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు 60 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ ప్ర‌కారం ఈ ఏడాదిలో మెకంజీ సంప‌ద సుమారు 24 బిలియ‌న్ల డాల‌ర్లు పెరిగింది. చాలా వ‌ర‌కు మెకంజీ ఆస్తుల‌న్నీ.. అమెజాన్ డాట్‌కామ్‌తో లింక్ అయి ఉన్నాయి. అయితే ఆ సంస్థ షేర్లు ఇటీవ‌ల 67 శాతం పెరిగిన విష‌యం తెలిసిందే. మ‌హ‌మ్మారి వ‌ల్ల ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. దీంతో అమెజాన్ షేర్ల విలువ శ‌ర‌వేగంగా పెరుగుతోంది.   

గ‌త జూలైలో సుమారు 170 కోట్ల డాల‌ర్ల సంప‌ద‌ను మెకంజీ విరాళం ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ కుబేరుల్లో ప్ర‌స్తుం మెకంజీ 18వ స్థానంలో ఉన్నారు.  అయితే అత్యంత వేగంగా త‌న సంప‌ద‌ను పంచిపెట్ట‌డానికి మార్గాల‌ను అన్వేషించాల‌ని త‌న బృందంతో తెలిపిన‌ట్లు ఆమె త‌న బ్లాగ్‌లో రాశారు.  ఈ ఏడాది స్కాట్ మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 6 బిలియ‌న్ల డాల‌ర్ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది.  అయితే ఓ వ్య‌క్తి ఇంత సంద‌ప‌ను ఒకే ఏడాదిలో దానం ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి అని  రాకీఫెల్ల‌ర్ ఫిలాంత్రోఫీ అడ్వైజ‌ర్ మెలిసా బెర్మ‌న్ పేర్కొన్నారు. సుమారు 384 గ్రూపుల‌కు త‌న దాన సంప‌ద చేరే విధంగా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు మెకంజీ త‌న బ్లాగ్‌లో వివ‌రించారు. ఆహార‌, సామాజిక అస‌మాన‌త‌లు ఉన్న ప్ర‌దేశాల‌కు ఎక్కువ‌గా త‌న నిధులు చేరే విధంగా చూస్తున్నారామె.  ఉన్న‌త విద్య‌కు చెందిన సుమారు 30 సంస్థ‌ల‌కు, ట్రైబ‌ల్ కాలేజీల‌కు, బ్లాక్ వ‌ర్సిటీల‌కు నిధుల‌ను దానం చేశారు. 40 ఫుడ్ బ్యాంక్‌ల‌క కూడా నిధులు ఇచ్చిన‌ట్లు మెకంజీ తెలిపారు.