మంగళవారం 31 మార్చి 2020
International - Mar 27, 2020 , 13:24:39

కరోనా మందు కనిపెట్టానన్నాడు.. కటకటాల్లోకి వెళ్లాడు

కరోనా మందు కనిపెట్టానన్నాడు.. కటకటాల్లోకి వెళ్లాడు

- అమెరికాలో చోటా నటుడు అరెస్టు  

హైదరాబాద్: ఓవైపు కోవిడ్ తో యావత్తు ప్రపంచం సతమతమవుతుంటే అమెరికాలో ఓ వ్యక్తి తన వద్ద ఈ వైరస్‌ను ఆపే మందు, సోకితే చికిత్స చేసే మందు ఉన్నదని ప్రకటించి కటకటాల పాలయ్యాడు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన కీత్ లారెన్స్ మిడిల్‌బ్రూక్ వృత్తిరీత్యా నటుడు. హాలివుడ్ సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో చిన్నాచితకా పాత్రలు వేస్తుంటాడు. అయితే ఈయనకు ఓ మందుల కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ కరోనాకు చికిత్స కనిపెట్టిందని, త్వరలో పంపిణీ ప్రారంభిస్తుందని మిడిల్‌బ్రూక్ ప్రకటించాడు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టినవారికి ఇబ్బడిముబ్బడిగా లాభాలు వస్తాయని ఆశ చూపాడు. బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ ఎర్విన్ మ్యాజిక్ జాన్సన్ ఈ సరికే తన కంపెనీలో పెట్టుబడులు పెట్టినవారిలో ఉన్నాడని కూడా ప్రచారం చేసుకున్నాడు.

\తమ కంపెనీ రూపొందించిన ఇంజక్షన్‌ను తీసుకున్న ఓ లాస్ ఏంజెలిస్ కరోనా రోగి 51 గంటల తర్వాత ఆరోగ్యంగా నడిచివెళ్లాడని మెసేజీలు పంపాడు. తన కంపెనీలో పది లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే కనీసం 200-300 రెట్లు రాబడి ఉంటుందని పేర్కొనడం గమనార్హం. అసలే కరోనాకు చికిత్స లేదు బాబూ అని వైద్యరంగం నెత్తీనోరూ బాదుకుని ప్రచారం చేస్తున్న తరుణంలో ఇలాంటి ఊదరగొట్టే ప్రచారం చేపట్టినందుకు అమెరికా ఎఫ్‌బీఐ ఆయనను అరెస్టు చేసింది. ప్రస్తుతం గడ్డురోజుల్లో ఇలాంటి ప్రచారాలు ప్రజలను బురిడీ కొట్టిస్తాయని ఎఫ్‌బీఐ ప్రాసిక్యూటర్ కోర్టులో పేర్కొన్నారు. ఏప్రిల్ 16న ఈ కేసు విచారణ జరుగుతంది. నేరం రుజువైతే మిడిల్‌బ్రూక్‌కు 20 సంవత్సరాల శిక్ష పడుతుంది.


logo
>>>>>>