శనివారం 06 జూన్ 2020
International - Apr 08, 2020 , 08:50:14

లాక్‌డౌన్ సడలించారు.. తిరిగి బిగించారు

లాక్‌డౌన్ సడలించారు.. తిరిగి బిగించారు

హైదరాబాద్: అమెరికా ఓ అగ్రరాజ్యం. అదునాతన వ్యవస్థలున్న దేశం. పకడ్బందీ శాంతిభద్రతలు ఉంటాయక్కడ. కాకపోతే రాజకీయ నాయకత్వం ఊగుసలాట వల్ల కొన్ని సమస్యలు వచ్చిపడుతున్నాయి. జార్జియా రాష్ట్రం ఇందుకు ఓ పెద్ద ఉదాహరణ. స్థానిక పరిపాలనా విభాగాలు కరోనా కట్టడిలో భాగంగా అన్ని పబ్లిక్ ప్రదేశాలను మూసివేశాయి. బీచ్‌ల వద్ద జనం గుమిగూడకుండా నియంత్రణలు విధించాయి. కానీ గవర్నర్ బ్రయాన్ కెంప్ ఒక్క కలంపోటుతో అంతా తారుమారు చేశారు. పెద్దగా ప్రమాదం ఏమీ లేదని, ప్రజలు వారాంతాలు హాయిగా గడపొచ్చని ఆర్డరు వేశారు. ఇకేంముంది ప్రజలు పొలోమని పంజరం వీడిన పక్షుల్లా బీచ్ లు, పార్క్ ల వెంబడి పడ్డారు. ఫలితంగా కరోనా విజృంభించింది. మరణాలూ పెరిగాయి. మంగళవారంనాటికి 348 మరణాలు సంభవించాయి. ఇన్‌ఫెక్షన్లు 9 వేలు దాటాయి. దీంతో స్థానిక పరిపాలనా విభాగాలు గగ్గోలు పెట్టాయి. ఇప్పుడు గవర్నర్ కెంప్ తాపీగా తన ఆదేశాలను సవరించుకునే పనిలో పడ్డారు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే సామెత కరోనాకు వర్తించదు. ఎందుకంటే ఒకసారి విజృంభిస్తే ఆపడం ఎవరి తరమూ కాదు.


logo