మంగళవారం 26 మే 2020
International - May 03, 2020 , 02:07:27

‘జైలు’ నుంచి బయటపడ్డాం!

‘జైలు’ నుంచి బయటపడ్డాం!

  • అమెరికాలో డజనుకు పైగా రాష్ర్టాల్లో ఆంక్షలు ఎత్తివేత
  • రెస్టారెంట్లు, మాల్స్‌ కళకళ

న్యూయార్క్‌, మే 2: ఆర్థిక వ్యవస్థల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు లాక్‌డౌన్‌ ఆంక్షల్ని తిరిగి కొనసాగించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో ఆ దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం ఆంక్షల్ని ఎత్తివేశాయి. దీంతో డజనుకుపైగా రాష్ర్టాల్లోని రెస్టారెంట్లు, స్టోర్లు, మాల్స్‌ తెరుచుకున్నాయి. ప్రజలు పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపారు. కొలరాడోలో క్షౌరశాలలు తెరువడంతో పురుషులు బారులు తీరారు. వ్యోమింగ్‌ రాష్ట్రంలో జిమ్‌లు, డే కేర్‌ సెంటర్లు, లూసియానా, నెబ్రాస్కా రాష్ర్టాల్లో రెస్టారెంట్లు, చర్చిలు, మాల్స్‌ తెరుచుకున్నాయి. మైన్‌లో గోల్ఫ్‌ కోర్సులు పునఃప్రారంభమయ్యాయి. దక్షిణ కరోలినాలో బీచ్‌లు, పార్కులను అధికారులు తెరిచారు. టెక్సాస్‌లో 25శాతం కెపాసిటీ నిబంధన (నాలుగు కుర్చీలున్న టేబుల్‌పై ఒకరు చొప్పున)తో రెస్టారెంట్లు తెరువడంతో ప్రజలు పోటెత్తారు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆర్లియాన్స్‌లోని ఓ కేఫ్‌లో కూర్చున్న ఓమహిళా అకౌంటెంట్‌ స్పంది స్తూ.. ‘జైలు నుంచి బయటపడ్డట్టు ఉన్నది’ అని అన్నారు. వాషింగ్టన్‌లో మే 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని గవర్నర్‌ ఇన్‌స్లీ తెలిపారు.

అప్పటివరకూ మూసివేతే!

ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేంతవరకూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్ని మూసే ఉంచుతామని న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్య్రూ క్యూమో తెలిపారు. మిగతా రాష్ర్టాలతో పోలిస్తే న్యూయార్క్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో 23,600 మంది చనిపోగా మరో మూడు లక్షల మందికి వైరస్‌ సోకింది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థల్ని పునఃప్రారంభించడం, విద్యార్థులు వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కష్టమని భావించిన క్యూమో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా న్యూయార్క్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరం జూన్‌తో ముగియనున్నది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మరో సెషన్‌ మొదలుకానున్నది.

క్లోరోక్వీన్‌ను వాడుతున్న దవాఖానలు

మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధాన్ని కొవిడ్‌-19 చికిత్సకు అమెరికాలోని యేల్‌ న్యూ హెవన్‌ సిస్టమ్స్‌ సంస్థ కిందనున్న పలు దవాఖానలు వాడుతున్నాయని, చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని మొదటి ప్రత్యామ్నాయంగా వైద్యులు రోగులకు ఇస్తున్నారని ‘ఎండీఎడ్జ్‌' అనే వైద్య పత్రిక శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. క్లోరోక్వీన్‌ ఔషధం చాలా చౌకైనదని, గత కొన్ని దశాబ్దాలుగా రోగులు దీన్ని వాడుతున్నారని, ఇది వారికి సౌకర్యవంతంగా ఉంటున్నదని భారత సంతతికి చెందిన అమెరికా వైద్యుడు నిహార్‌ దేశాయ్‌ తెలిపారు. కాగా క్లోరోక్వీన్‌ తర్వాత ‘టోసిలిజుమాబ్‌'ను కరోనా చికిత్సకు రెండో ప్రత్యామ్నాయంగా వైద్యులు వాడుతున్నట్టు పత్రిక వెల్లడించింది. మరోవైపు, దేశంలో కొవిడ్‌-19 వల్ల సంభవించే మరణాలు లక్ష కంటే తక్కువగానే ఉంటాయని తాను భావిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం తెలిపారు. ఇది భయంకరమైన సంఖ్య అని ఆయన అభివర్ణించారు. 


logo