శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 17, 2020 , 08:34:58

బ్రిటన్‌లో మే 7 వరకు పొడిగింపు..

బ్రిటన్‌లో మే 7 వరకు పొడిగింపు..

  • ఆస్ట్రేలియాలో మరో నాలుగు వారాలపాటు ఆంక్షలు

లండన్‌/కాన్‌బెర్రా, ఏప్రిల్‌ 16: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ను మరో మూడు వారాల పాటు పొడిగిస్తున్నట్టు బ్రిటన్‌  ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మే 7 వరకు దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, ప్రజలందరూ నిర్ణీత దూరాన్ని పాటించాలని పేర్కొంది. గతనెల 23న దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు యూకే ప్రకటించడం తెలిసిందే. కాగా గురువారంనాటికి దేశంలో వైరస్‌ కారణంగా మరణాల సంఖ్య 13,729కి చేరింది. మరోవైపు, వైరస్‌ కేసుల్లో పెరుగుదల అంతగా లేనప్పటికీ ఆస్ట్రేలియా ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. దేశంలో మరో నాలుగు వారాలపాటు ఆంక్షల్ని పొడిగిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఈమేరకు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ఓ ప్రకటన చేశారు. ప్రజలందరూ నిర్ణీత దూరాన్ని పాటించాలని సూచించారు. ఆస్ట్రేలియాలో 6,500 వైరస్‌ కేసులు నమోదు కాగా, 63 మంది మృత్యువాతపడ్డారు. ఇంకోవైపు నార్తన్‌ ఐర్లాండ్‌ కూడా మే 9 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది.

యూరప్‌లో 90 వేలు దాటిన మృతులసంఖ్య 

పారిస్‌: కరోనా మహమ్మారి బారినపడి యూరప్‌ దేశాల్లో మరణించిన వారి సంఖ్య గురువారం 90,180కి చేరుకున్నది. ఇది ప్రపంచవ్యాప్త మృతుల్లో 65 శాతం కంటే ఎక్కువే. 10,47,279 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో వివిధ యూరప్‌ దేశాల్లో చికిత్స పొందుతున్నారు.


logo