అందమైన లొకేషన్లో ఫొటోలు, వీడియోలు తీయాలంటే మంచి ప్రొఫెషనల్ క్యామ్ లేదా హైరిజల్యూషన్ కెమెరా ఉన్న ఫోన్లను ఉపయోగిస్తాం. అయితే, చేతిలో పట్టుకొని ఫొటోలు తీయడం కొందరికి ఇబ్బందిగా మారొచ్చు. అలాగే, తాము కండ్లతో చూసిన చిత్రాలను అదే కోణంలో కెమెరా బంధించకపోవచ్చు. దీనికి చెక్ పెడుతూ.. ఇప్పటికే స్నాప్ స్పెక్టికల్స్, గూగుల్ కొన్ని స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొచ్చాయి. మరిన్ని వినూత్న ఫీచర్లను జోడిస్తూ ‘రే-బ్యాన్ స్టోరీస్’ పేరుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్-రేబ్యాన్ కంపెనీలు సంయుక్తంగా సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను ఇటీవల విడుదల చేశాయి. అయితే, వీటిపై పలువురు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంపై ప్రత్యేక కథనం..
ధర ఎంత? ఎక్కడ దొరుకుతాయి?
ఈ స్మార్ట్ గ్లాసెస్ ధర రూ.22,000-28,000 మధ్య ఉంటుంది. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, బ్రిటన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఏమిటీ రే-బ్యాన్ స్టోరీస్?
ప్రత్యక్షంగా మన కంటికి కనిపించే చిత్రాలు, వీడియోలను అదే కోణంలో అప్పటికప్పుడు లైవ్‌గా రికార్డు చేస్తూ ప్రసారం చేసేందుకు సాయపడేవే ‘రే-బ్యాన్ స్టోరీస్’ స్మార్ట్ గ్లాసెస్.
ఎలా పనిచేస్తాయి?
‘రే-బ్యాన్ స్టోరీస్’ స్మార్ట్ గ్లాసెస్‌లో ఎల్ఈడీ లైట్ ఉన్న రెండు 5 ఎంపీ (మెగాపిక్సెల్) కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాల సాయంతో దృశ్యాలను రికార్డ్ చేసేటప్పుడు తెలుపు రంగులో లైట్ వెలుగుతుంది. వినియోగదారులు క్యాప్చర్ బటన్ని ఉపయోగించి.. ఫేస్బుక్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్లతో హ్యాండ్స్-ఫ్రీ విధానంలో ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. ఈ గ్లాసెస్ సాయంతో ఆరు గంటల పాటు 50 వీడియోలు లేదా 200 ఫోటోలు తీయొచ్చు. వీటిని బ్లూటూత్ లేదా వైరలెస్ కనెక్టివిటీ సాయంతో ఫోన్, ఎలక్ట్రానిక్ స్టోరేజీ గ్యాడ్జెట్లో నిక్షిప్తం చేసుకోవచ్చు.
అభ్యంతరాలు ఎందుకు?
‘రే-బ్యాన్ స్టోరీస్’పై పలువురు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లాసెస్ కారణంగా పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లాసెస్ సాయంతో రహస్య సమావేశాలను రికార్డ్ చేసే ప్రమాదం ఉందంటున్నారు. ఇతరుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు కూడా రికార్డ్ చేయొచ్చు. అలా రికార్డ్ చేస్తున్న విషయం కూడా ఎదుటివారికి అంత స్పష్టంగా తెలియకపోవచ్చు. క్యాప్చర్ బటన్ని నొక్కగానే గ్లాసెస్ మీద ఉన్న తెలుపు ఎల్ఈడీ లైట్ వెలుగుతున్నప్పటికీ, పగటిపూట అది ఎంతమందికి కనిపిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో ఉపయోగాలను పక్కన పెడితే, ప్రమాదమే ఎక్కువగా ఉందని మండిపడుతున్నారు. ‘రే-బ్యాన్ స్టోరీస్’ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.