శనివారం 29 ఫిబ్రవరి 2020
భూమిపైనే జీవరహిత ప్రదేశం

భూమిపైనే జీవరహిత ప్రదేశం

Feb 14, 2020 , 07:39:40
PRINT
భూమిపైనే జీవరహిత ప్రదేశం

తూర్పు ఆఫ్రికా ఇథియోపియా దేశంలోని డల్లాల్‌ (Dallol) గ్రామపరిధికి చెందిన భూఉష్ణక్షేత్ర మడుగులలో ‘సూక్ష్మజీవ ఆనవాళ్లు కనిపించడం లేదని’ తాజా పరిశోధనలో తేలింది. డానాకిల్‌ (Danakil) ఎడారి ప్రభావితమైన ఈ ప్రదేశం ఎంత నరకతుల్యమైందంటే ‘అక్కడి మడుగులన్నీ భౌగోళికపరంగా అత్యుష్ణ, అత్యధిక జఠరామ్లత, లవణీయతలను కలిగి ఉన్నాయి. ఇంతటి బహుళ తీవ్రతర (multi-extreme) ఆవరణాలే జీవరాహిత్యానికి దోహద పడుతున్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. సాధారణంగానే ఇక్కడ చలికాలంలోనే 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. దీనికితోడు ఓ అగ్నిపర్వత బిలం నుండి వచ్చిన తీవ్ర లవణీయ, విషవాయువుల కారణంగా సరస్సు జలాలు భీకరంగా మరిగాయి. లవణీయత, ఆమ్లీయతల కొలతలు (pH values) పూర్తి ప్రతికూలతకు చేరాయి. తత్ఫలితంగానే ఆ మడుగులలో సూక్ష్మజీవాల ఆనవాళ్లు మృగ్యమైనట్లు వారు పేర్కొన్నారు. గతేడాది (2019) అక్టోబర్‌లో ‘ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసర్చి’ (సీఎన్‌ఆర్‌ఎస్‌)కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధన ‘నేచర్‌ ఎకాలొజీ అండ్‌ ఎవొల్యూషన్‌' తాజా సంచికలో ప్రచురితమైంది. దీనికంటే ముందు కిందటేడాదే వేరొక పరిశోధన ఆ తటాకాలలో జీవమున్నట్లు తేల్చినా, తాజా పరిశోధనలో భాగంగా విభిన్న విధానాలు జీవరహిత స్థితినే వెల్లడించడం గమనార్హం. logo