గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 12:02:55

బీరుట్‌ పేలుళ్లు..100మందికి పైగా మృతి

బీరుట్‌ పేలుళ్లు..100మందికి పైగా మృతి

బీరుట్: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని  పోర్టు ప్రాంతంలో  మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్ల ధాటికి పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మరణించారు.  వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా చాలా మంది  శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఓడరేవు  నుంచి ఇంకా పొగ వస్తూనే ఉన్నది. వీధులన్నీ శిథిలాలు, దెబ్బతిన్న వాహనాలతో నిండిపోయాయి. పరిసర ప్రాంతాల్లో భవనం పైకప్పులు కూడా ఎగిరిపోయాయి.  ఈ ప్రమాదంలో 100మందికి పైగా మరణించారని, సుమారు 4వేల మందికి పైగా గాయపడ్డారని  లెబనీస్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. పేలుళ్లకు కారణమేమిటో ఇప్పటి వరకు తెలియలేదు.   గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. 

ఓడరేవు వద్ద ఓ గిడ్డంగిలో నిల్వ చేసిన  2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని ఆదేశ అంతర్గత మంత్రి  మొహమ్మద్‌ ఫాహ్మి స్థానిక టీవీ ఛానెల్‌తో చెప్పారు.  ఈ పేలుడు వల్ల  బీరుట్ ఓడరేవు పూర్తిగా ధ్వంసమైంది.


logo