సోమవారం 30 మార్చి 2020
International - Mar 09, 2020 , 11:46:54

చైనాలో కరోనా తగ్గుముఖం.. ఇతర దేశాల్లో విజృంభణ

చైనాలో కరోనా తగ్గుముఖం.. ఇతర దేశాల్లో విజృంభణ

హైదరాబాద్‌ : చైనాలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. ఐరోపా దేశాల్లో కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇటలీలో కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 366 మంది మృతి చెందారు. అక్కడ నిన్న ఒక్క రోజే 133 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇటలీలో కొత్తగా 1,492 మందికి కరోనా వైరస్‌ సోకగా, మొత్తం కేసుల సంఖ్య 7,375కి చేరింది.

చైనాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. చైనాలో నిన్న ఒక్కరోజే కరోనాతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 40 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ఇప్పటి వరకు చైనాలో కరోనా వైరస్‌తో 3,119 మంది మృతి చెందారు. 

సౌత్‌ కొరియాలో 7,134 కేసులు నమోదు కాగా, 50 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో 1,126 కేసులు నమోదు అయ్యాయి. 19 మంది మృతి చెందారు. యూకేలో ముగ్గురు, యూఎస్‌లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో 902 కేసులు నమోదు అయ్యాయి.

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 42కి చేరింది. కేరళలో మూడేళ్ల చిన్నారికి ఈ వైరస్‌ సోకడంతో ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ అమ్మాయి కుటుంబం ఇటీవలే ఇటలీ నుంచి వచ్చింది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర రాష్ర్టాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. 


logo