గురువారం 16 జూలై 2020
International - Jun 18, 2020 , 20:03:28

గల్వాన్‌ నదికి ఆ పేరెలా వచ్చింది?

గల్వాన్‌ నదికి ఆ పేరెలా వచ్చింది?

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో గల్వాన్‌ లోయ, గల్వాన్‌ నది పేరు తరచుగా  వినిపిస్తోంది. అయితే ఇది తూర్పు లడఖ్‌లోని లైన్‌ ఆఫ్‌ ఆక్చువల్‌ కంట్రోట్‌ (ఎల్‌ఏసీ) పక్కనే ఉన్న లోయ గుండా ప్రవహిస్తుంది. ఈ లోయ తమకు చెందినదంటూ భారత్‌, చైనా దేశాలు గత కొన్ని రోజలుగా వాదించుకోవడమే కాకుండా ఘర్షణలకు దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన దాదాపు 20 మంది సైనికులు అమరులయ్యారు. అదేవిధంగా చైనా వైపున కూడా పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి ఉంటారని సాక్షులు చెప్తున్నారు. 

అయితే ఈ గల్వాన్‌ నది.. దాని హిస్టరీ గురించి పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. లడాఖ్‌కు చెందిన గులాం రసూల్‌ అనే వ్యక్తి 1920 ప్రాంతంలో హిమాలయ పర్వత శ్రేణులతోపాటు టిబెట్‌, పామిర్‌ పర్వతాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌, కారాకోరం పర్వతశ్రేణి, మధ్య ఆసియాలో ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. తన పర్యటనలో అనేక మంది యురోపియన్‌ అన్వేషకులకు సహాయం చేశాడు. 

1887లో ప్రపంచంలోని రెండో అతిపెద్ద పర్వతమైన కే 2ను కొలిచేందుకు వచ్చిన ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన మేజర్‌ హెచ్ హెచ్‌ గాడ్విన్‌ ఆస్టిన్‌ వంటి వారికి కూడా రసూల్‌‌ సహకరించాడు. 1904లో ఆంగ్లో-టిబెటన్‌ ఒప్పందంపై సంతకం చేసేందుకు బాధ్యత వహించిన బ్రిటిష్‌ ఆర్మీ ఆఫీసర్‌ సర్‌ ఫ్రాన్సిస్‌ యంగ్‌హస్పెండ్‌తో కలిసి ఆయన ప్రయాణించారు. యూరప్‌కు చెందిన ఎందరో పర్వతారోహకులకు మార్గదర్శనం చేశారు.

128 ఏళ్ల చరిత్ర

1892 లో పామిర్‌ పర్వతశ్రేణి పర్యటనకు వచ్చిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ చార్లెస్‌ ముర్రే తిరుగు ప్రయాణంలో తప్పిపోగా 14 ఏండ్ల వయసున్న గులాం రసూల్‌ ఆయనను గుర్తించేందుకు అక్కడి నది ప్రాంతంలో తీవ్రంగా గాలించి చివరకు పట్టుకొన్నాడు. తనను కనిపెట్టేందుకు సాహసించిన గులాం రసూల్‌ ప్రయత్నాలను కల్నల్‌ ముర్రే ఎంతగానో అభినందించి.. ఈ ప్రాంతానికి గులాం రసూల్‌ గల్వాన్‌గా నామకరణం చేశారు. దాంతో లెఫ్టినెంట్ కల్నల్‌ చార్లెస్‌ ముర్రే తప్పిపోయిన ప్రాంతం.. గల్వాన్‌ రివర్‌ ప్రాంతంగా వాడుకలోకి వచ్చింది. ఈ విషయాలను ప్రసిద్ధ చరిత్రకారుడు అబ్దుల్‌ ఘనీ ఆరోజుల్లోనే రాశాడు. ఈ నేపథ్యంలోనే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను లడఖ్‌లో బ్రిటిష్‌ జాయింట్‌ కమిషనర్‌కు చీఫ్‌ నేటివ్‌ అసిస్టెంట్‌గా నియమించింది.

'రాబిన్‌హుడ్‌' ఫ్యామిలీ

గులాం రసూల్‌ గల్వాన్‌ 1878లో జమ్ముకశ్మీర్‌లోని లడాఖ్‌ ప్రాంతంలో జన్మించారు. ఈయన తండ్రి, తాతలు కూడా ఇదే ప్రాంతంలో నివసించేవారు. గులాం రసూల్‌ తన తాత మహ్ముత్‌ గల్వాన్‌ను కారా గల్వాన్‌గా, రాబిన్‌హుడ్‌గా చిత్రీకరించారు. కశ్మీర్‌లో కారా అంటే నలుపు అని , గల్వాన్‌ అంటే దొంగ అని అర్థం ఉన్నది. ఈయన తాత, తండ్రి ధనికుల నుంచి దోచుకొని పేదలకు పంపిణీ చేసేవారు. అప్పటి కశ్మీర్‌ మహారాజు కారా గల్వాన్‌ను అరెస్ట్‌ చేయడంతో ఆయన కుటుంబానికి చెందిన చాలా మంది కశ్మీర్‌ విడిచి పారిపోయారు. చివరకు 1925లో గులాం రసూల్‌ గల్వాన్‌ కన్నుమూశారు. ఈ విషయాలను ఆయనన ఆత్మకథ 'సర్వెంట్స్ ఆఫ్‌ సాహిబ్స్‌' పుస్తకంలో పుస్తక రచయిత పూసగుచ్చినట్లు వివరించారు. 


logo