మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 16:14:22

మరణశిక్షపై జాదవ్ సమీక్ష కోరడం లేదన్న పాక్

మరణశిక్షపై జాదవ్ సమీక్ష కోరడం లేదన్న పాక్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ చెరలో ఉన్న కుల్‌భూషన్ జాదవ్‌‌కు విధించిన మరణశిక్షపై కోర్టులో సమీక్షను ఆయన  కోరడం లేదని పాకిస్థాన్ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించాలని కోరుతున్నట్లు పేర్కొంది. భారత మాజీ నౌకాదళ అధికారి అయిన కుల్‌భూషన్ జాదవ్ బలూచిస్థాన్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించిన పాక్ 2016 మార్చిలో అరెస్ట్ చేసింది. ఒక ఏడాది తర్వాత ఆ దేశ ఆర్మీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది.

మరోవైపు పాక్ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను పాక్ కిడ్నాప్ చేసిందని ఆరోపించింది. పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేయగా భారత్‌కు అనుకూలంగా గత ఏడాది జూలైలో తీర్పు వచ్చింది. జాదవ్ మరణశిక్షపై పాక్ సమీక్షించాలని, ఆయనను కలిసేందుకు భారత్‌కు దౌత్యపరమైన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.

మరోవైపు అంతర్జాతీయ కోర్టు తీర్పును గౌరవిస్తూ మరణశిక్షపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని జూన్ 17న జాదవ్‌ను కోరినట్లు పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ అహ్మద్ ఇర్ఫాన్ బుధవారం మీడియాకు తెలిపారు. అయితే అందుకు ఆయన తిరస్కరించారని, పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించాలని చెప్పారన్నారు. నిబంధనల ప్రకారం గడువులోగా ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉన్నదని చెప్పారు. జాదవ్ స్వయంగా లేదా ఆయన తరుఫు ప్రతినిధి లేదా పాక్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన దౌత్య అధికారి ద్వారా రివ్యూ పిటిషన్ దాఖలు చేయవచ్చని ఇర్ఫాన్ చెప్పారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు జాదవ్‌ను కలిసేందుకు రెండోసారి దౌత్యపరమైన అనుమతిని ఇచ్చినట్లు పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ అహ్మద్ ఇర్ఫాన్ చెప్పారు. తొలిసారి ఇచ్చిన అనుమతితో జాదవ్ తల్లి, భార్య అతడ్ని కలిశారని తెలిపారు. తాజాగా జాదవ్ తండ్రితోపాటు భార్యకు ఆయనను కలిసే అవకాశం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.


logo