బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 16, 2020 , 17:58:05

కుల్‌భూషన్‌ను కలిసేందుకు దౌత్య అనుమతి ఇచ్చిన పాక్

కుల్‌భూషన్‌ను కలిసేందుకు దౌత్య అనుమతి ఇచ్చిన పాక్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషన్ జాదవ్‌ను కలిసేందుకు ఆ దేశం రెండోసారి దౌత్యపరమైన అనుమతి ఇచ్చింది. గురువారం సాయంత్రం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం 4.30 గంటలకు) భారత దౌత్య అధికారులు జాదవ్‌ను కలువవచ్చని తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఈ మేరకు సమాచారం అందించింది. కేవలం ఇద్దరు దౌత్య అధికారులను మాత్రమే అనుమతిస్తామని పాక్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కుల్‌భూషన్ జాదవ్‌ను దౌత్యపరంగా రెండోసారి కలిసి మాట్లాడాల్సిన అంశాలపై భారత రాయబార కార్యాలయ అధికారులు చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన అనుమతి కోసం పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలోని దక్షిణాసియా వ్యవహారాల డైరెక్టర్ జనరల్‌ను కలిశారు. జాదవ్‌ను ఒంటిరిగా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత రాయబార అధికారులు కోరారు.

భారత నౌకాదళ మాజీ అధికారి అయిన కుల్‌భూషన్‌ను గూఢచర్యం, ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలపై 2016 మార్చిలో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. 2017 ఏప్రిల్‌లో ఆ దేశ ఆర్మీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను పాక్ అధికారులు కిడ్నాప్ చేసి ఆయనపై తప్పుడు కేసులు పెట్టినట్లు భారత్ ఆరోపించింది. జాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయగా గత ఏడాది జూలైలో భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కుల్‌భూషన్ ఉరి శిక్షపై పాక్ సమీక్షించాలని, అతడిని కలిసేందుకు భారత్‌కు దౌత్యపరమైన అనుమతి ఇవ్వాలని అంతర్జాతీయ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్ తొలిసారి దౌత్య అనుమతి ఇచ్చింది.

మరోవైపు మరణశిక్షపై సమీక్షను జాదవ్ వ్యతిరేకిస్తున్నారని, పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించాలని ఆయన చెబుతున్నారని పాకిస్థాన్ ఇటీవల తెలిపింది. అయితే పాక్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని భారత్ ఆరోపించింది. మరణశిక్షపై సమీక్ష పిటిషన్ దాఖలు చేసే గడువు ఈ నెల 20తో ముగియనుండటంతో జాదవ్‌ను కలిసేందుకు షరతులు‌లేని దౌత్యపరమైన అనుమతిని కోరింది. ఈ నేపథ్యంలో జాదవ్‌ను భారత దౌత్య అధికారులు కలిసేందుకు రెండోసారి దౌత్యపరమైన అనుమతిని  పాకిస్థాన్ గురువారం మంజూరు చేసింది.logo