Pink lagoon: పై చిత్రాన్ని ఒకసారి పరిశీలించండి..! ఏం కనిపిస్తుంది..? ఒక సరస్సులోని నీరంతా గులాబీ రంగులో ఉంది కదా..! సాధారణంగా నీళ్లు తేటగా ఉండాలి..! అయితే మురుగునీరు చేరడంవల్ల కొన్ని సరస్సులు, చెరువులలో నీరు నలుపు రంగులోకి లేదంటే ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. కానీ ఈ సరస్సులోని నీరు గులాబీ రంగులోకి ఎందుకు మారినట్టు..? మీ సందేహం కూడా అదేకదా..? అయితే కారణం ఏమిటో తెలుసుకుందాం పదండి..
పైన గులాబీ రంగులో కనిపిస్తున్న సరస్సు లాటిన్ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో దక్షిణ పటగోనియా ప్రాంతంలో ఉన్నది. సరస్సులోని నీరంతా గులాబీ రంగులో ఉండటంతో ఈ సరస్సుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో సరస్సు గులాబీ రంగులోకి మారడానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
ఆ పరిశోధనల్లో రొయ్యలు చెడిపోకుండా ఎక్కువ కాలం నిలువ చేసేందుకు ఉపయోగించే రసాయనాలే సరస్సులో నీరు ఎరుపు రంగులోకి మారడానికి కారణమని తేలింది. రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేయడం కోసం కొన్నాళ్ల పాటు సోడియం సల్ఫైట్ లాంటి రసాయనాల్లో నిలువ ఉంచుతారు. అదేవిధంగా ఫిష్ ఫ్యాక్టరీల్లో సైతం చేపలు కుళ్లిపోకుండా యాంటీ బ్యాక్టీరియల్ ప్రోడక్ట్‌ను ఉపయోగిస్తారు. ఆ తర్వాత రసాయన వ్యర్థాలను సరస్సులోనే వదిలేస్తారు. ఈ వ్యర్థాలు అతిగా పేరుకుపోవడంవల్లే ఆ సరస్సులోని నీరు గులాబీ రంగులోకి మారింది.