బుధవారం 02 డిసెంబర్ 2020
International - Oct 22, 2020 , 00:50:39

అబద్ధాల రారాజు

అబద్ధాల రారాజు

  • మూడున్నరేండ్లలో 20 వేలకుపైగా 
  • అసత్యాలు, తప్పుడు ప్రకటనలు
  • ఆర్థిక వ్యవస్థ, కరోనా-అంశమేదైనా అబద్ధాల వల్లింపే
  • ట్రంప్‌పై అమెరికన్‌ మీడియా ధ్వజం

అగ్రరాజ్యం అమెరికాకు అధినేత అయన. అయితే అసత్యాలకు చిరునామాగా, అబద్ధాల కోటకు రారాజుగా మారిపోయారు. ఆయన నోటి నుంచి జాలువారిన ప్రతిపదం ఓ అసత్య ప్రవచనమే. ప్రతి ప్రకటన ఓ అబద్ధానికి నిలువుటద్దమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత మూడున్నరేండ్లలో ట్రం ప్‌ చెప్పిన అసత్యాలు, తప్పుడు ప్రకటనలపై వాషింగ్టన్‌ పోస్ట్‌ సహా పలు అమెరికన్‌ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.

జనవరి 20, 2017లో అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు మొదలు..  2020 జూలై 9 నాటికి గత మూడున్నరేండ్లలో అక్షరాలా 20,005 అసత్యాలు, లేక తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసి ట్రంప్‌ రికార్డు సృష్టించారు. వీటిలో దాదాపు వెయ్యి అబద్ధాలు ఒక్క కొవిడ్‌-19కు సంబంధించినవే. మొత్తం అబద్ధాల్లో మొదటి పదివేల అసత్యాలు ఆయన అధికారానికి వచ్చిన తొలి 827 రోజులలోనే పలికారు. కేవలం 440 రోజుల్లోనే రెండో దఫా పదివేల అబద్ధాలను తన ఖాతాలో నింపేశారు. ఇలా 1,267 రోజుల్లో (2020 జూలై 9 నాటికి) మొత్తం 20,055 అబద్ధాలతో రికార్డు సృష్టించారు. అంటే రోజుకు సగటున 16 అబద్ధాలు ఆడుతూ ట్రంప్‌ పబ్బం గడుపుకున్నారన్న మాట. 

తొలి నుంచి అంతే..

అసత్యాలు చెప్పడం, తన స్వార్థం కోసం ఇతరులపై నిందలు వేసి వాళ్లను తప్పుడు మనుషులుగా చిత్రీకరించడం ట్రంప్‌నకు చిన్నప్పటి నుంచే అలవాటని ఆయన సోదరి మెరియానే ట్రంప్‌ బేరీ, ఆయన మేనకోడలు మేరీ ట్రంప్‌ పలు సందర్భాల్లో చెప్పారు. అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆయన అబద్ధాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రస్తుతం ఎన్నికల్లో అధ్యక్ష పోటీలో ఉన్న జో బిడెన్‌ విషయంలో ట్రంప్‌ చేసే ప్రకటనలు దాదాపుగా తప్పుడువేనని నివేదికలు, ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సైట్లు (నిజాలను సరిచూసే సైట్లు) చెబుతున్నాయి. తనపై అభిశంసన, కరోనా, ఆర్థిక వ్యవస్థ పతనం, జార్జి ఫ్లాయిడ్‌ దారుణ హత్యానంతర పరిణామాలు తదితర అంశాల్లో ట్రంప్‌ లెక్కలేనన్ని అబద్ధాలు వల్లించారు. 

వేటిపై ఎన్ని అబద్ధాలు

ఆర్థికవ్యవస్థ -1,860, వలస విధానం-2,635, ఉద్యోగాలు-1,464 , దౌత్య విధానం-2,282,  ఆరోగ్య సేవలు-1,070, ఎన్నికలు-686, పర్యావరణం-562, వ్యక్తిగత విషయాలు-685,  మారణాయుధాలు-59, కరోనా సంక్షోభం-977, అభిశంసన-1,200, జార్జి ఫ్లాయిడ్‌-150

అబద్ధాల రికార్డులు

ఒక్కరోజులో అత్యధిక అబద్ధాలు-నవంబర్‌ 3, 2018 (128 అసత్యాలు)

ఒక్క నెలలో అత్యధిక అబద్ధాలు-అక్టోబర్‌, 2018 (1,205 అసత్యాలు)