శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 03:03:21

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతి!

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతి!

  • ఉత్తర కొరియా అధ్యక్షుడిపై మళ్లీ వదంతులు
  • కావాలనే విషయాన్ని దాస్తున్నారు 
  • కిమ్‌ సోదరికే పగ్గాలు: జర్నలిస్టు వెల్లడి
  • ఉత్తర కొరియా గూఢచార సంస్థ ఖండన

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరణించారని ఓ జర్నలిస్ట్‌ తెలిపారు. ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ దేశ పాలకురాలిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కిమ్‌ ప్రస్తుతం కోమాలో ఉన్నారని, ఆయన మరణించలేదని దక్షిణ కొరియా రాజకీయ వ్యవహార శాఖలో గతంలో ఉన్నతాధికారిగా పనిచేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. దీంతో కిమ్‌ కోమాలో ఉన్నట్టు వార్తలు ప్రచారం అయ్యాయి.  ఈ క్రమంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరణించారని తాను విశ్వసిస్తున్నట్టు ఇటీవల ఉత్తర కొరియాకు వెళ్లి వచ్చిన జర్నలిస్ట్‌ రాయ్‌ కాలే తెలిపారు. 

ఉత్తర కొరియా యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే కిమ్‌ ఆరోగ్యంపై స్పష్టతనివ్వడంలేదని, నిజాన్ని బహిర్గతం చేస్తే దేశంలో పెద్దఎత్తున కార్యచరణలు మారే అవకాశం ఉండటంతో విషయాన్ని దాచిపెడుతున్నారని వివరించారు. కిమ్‌ లేదా ఇతర నేతల ఎలాంటి సమాచారాన్నైనా ప్రజలకు చెప్పడానికి వాళ్లు ఇష్టపడరని ఆరోపించారు. ఉత్తర కొరియా మాజీ పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మరణించినప్పుడు కూడా ఇలాగే జరిగిందని కాలే గుర్తుచేశారు. ఇల్‌ మరణించిన కొన్ని నెలల తర్వాత ఆ విషయాన్ని అక్కడి యంత్రాంగం ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుతం కిమ్‌ మృతి చెందారో లేదోనన్న విషయం ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాతనే తెలుస్తుందన్నారు. 


మరోవైపు, కిమ్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, అధిక బరువు కారణంగా నడువలేకపోతున్నారని రూత్‌ అన్నే మోంటీ అనే రచయిత్రి ఇటీవల పేర్కొన్నారు. ఇదిలాఉండగా, అమెరికా, దక్షిణ కొరియాలతో దౌత్య వ్యవహారాలను చక్కబెట్టేందుకు కిమ్‌ యో జోంగ్‌తో పాటు ఓ ఉన్నతాధికార బృంధానికి అధికారాల్ని కట్టబెట్టినట్టు దక్షిణ కొరియా గూఢచార సంస్థ ఒకటి పేర్కొంది. అయితే, కిమ్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఉత్తర కొరియా నేషనల్‌ ఇంటెలీజెన్స్‌ సర్వీసెస్‌ (ఎన్‌ఐఎస్‌) పేర్కొన్నది. కొంతకాలంగా కిమ్‌ ఎలాంటి కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో ఆయన మరణించినట్టు కొన్ని రోజుల క్రితం కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఓ అధికారిక కార్యక్రమంలో కిమ్‌ పాల్గొన్న వీడియోను విడుదల చేసి అధికారులు ఆ వార్తలకు చెక్‌ పెట్టారు.


logo