బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 13:18:01

పోలీస్‌ కాల్పుల్లో మూగ బాలుడు దుర్మ‌ర‌ణం.. ప‌రిస్థితి ఉద్రిక్తం

పోలీస్‌ కాల్పుల్లో మూగ బాలుడు దుర్మ‌ర‌ణం.. ప‌రిస్థితి ఉద్రిక్తం

జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌: ద‌క్షిణాఫ్రికా రాజ‌ధాని జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో దారుణం జ‌రిగింది. పోలీసుల కాల్పుల్లో మూగ‌వాడైన 16 ఏండ్ల‌ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. న‌థానియేల్ జూలియ‌స్ అనే బాలుడు త‌న ఇంటి ముందు నిల‌బడి ఉండ‌గా.. పోలీసుల తుపాకీ నుంచి వ‌చ్చిన తూటా అత‌ని ఛాతీలోకి దూసుకుపోయింది. వెంట‌నే కుప్పకూలిన బాలుడిని పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. అయితే, బాలుడి హ‌త్య‌ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత‌ల‌కు దారితీసింది. 

బాలుడి హ‌త్య‌ను నిర‌సిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. పోలీసులు అవినీతిప‌రుల‌ని, న‌థానియేల్‌కు న్యాయం చేయాల‌ని నినాదాలు చేశారు. తాము అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేద‌నే కార‌ణంతో పోలీసులు త‌మ బిడ్డ‌ను కాల్చిచంపార‌ని బాలుడి కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. క‌నీసం అత‌ను మూగ‌వాడు అనే విష‌యం కూడా గుర్తించ‌కుండా దారుణానికి ఒడిగ‌ట్టార‌ని విల‌పిస్తున్నారు. కాగా, త‌మ ప్రాంతంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నాయ‌ని, బాధ్యులైన పోలీసులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆందోళ‌న‌కారులు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే, మృతుడి కుటుంబ‌సభ్యుల ఆరోపణ‌లను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఒక రౌడీ ముఠాకు, త‌మ‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రుగుతున్న స‌మ‌యంలో బాలుడు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని, పొర‌పాటున బుల్లెట్ అత‌ని ఛాతీలోకి వెళ్లింద‌ని చెబుతున్నారు. అయితే పోలీసులు చెప్పేదాంట్లో ఏమాత్రం నిజం లేద‌ని, క‌ట్టుక‌థ చెబుతున్నార‌ని బాలుడి కుటుంబ‌స‌భ్యులు మండిప‌డుతున్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo